నన్ను పట్టించుకొనే వారే లేరు..ప్రముఖ సింగర్ ఆవేదన

Asha Bhosle | Photo Credit: Twitter

మనిషి జీవితంలో సెల్‌ఫోన్లు ఓ భాగమైపోయాయి. సెల్‌ఫోన్‌ లేనిదే కొందరి రోజు గడవదు. అన్నం లేకుండా ఒకరోజు ఉంటారేమో కానీ…మొబైల్‌ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేరు నేటి జనం. ఇదే విషయంపై ప్రముఖ గాయని ఆశాబోంస్లే పెట్టిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆశాను కలవడానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఆమె నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో ఆశా ముందు కూర్చున్నవారంత సెల్‌ఫోన్‌ చాటింగ్‌లో మునిగిపోయారు. మాట్లాడడానింటూ వచ్చి ఆ ధ్యాసే మరిచిపోయారు. అయితే వారంతా ఆమె ముందు కూర్చున్నారన్నమాటే కానీ…ఎవరి ఫోన్లతో వారు బిజీగా ఉండిపోయారు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆశా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. బగ్‌డోగ్రా నుంచి కోల్‌కతా వరకు నన్ను చూడటానికి వచ్చారు కానీ.. మాట్లాడేవారు ఒక్కరూ లేరు. ఇందుకు టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండెర్‌ గ్రహంబెల్‌కు ధన్యవాదాలు చెప్పాలి అంటూ వ్యంగంగా ట్వీట్‌ చేశారు ఆశా భోంస్లే.

ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి వపరీతమైన రెస్ఫాన్స్‌ వచ్చింది. 25 వేల మంది లైక్‌లు కొట్టారు. ఆశా పెట్టిన పోస్ట్‌ నేటితరానికి కనువిప్పులాంటిది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే… అంత గొప్ప గాయని ముందు ఫోన్‌ పట్టుకుని కూర్చోవాలన్న ఆలోచన వారికెలా వచ్చింది? అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.