ఇప్పటి వరకు సీక్రెట్‌గా మెయింటైన్ చేసిన మీ వాట్సాప్ ఛాటింగ్ మొత్తం..

బాబోయ్.. చాటు మాటుగా సాగించే వాట్సాప్ ఛాటింగ్ వ్యవహారం మొత్తం ఇంట్లో వాళ్లకి తెలిసిపోయింది. కొంప కొల్లేరయ్యేలా ఉంది. వెంటనే సిమ్ మార్చేస్తే సరి. అర్జంట్‌గా పాత సిమ్ పడేసి కొత్త సిమ్ వేయించుకుంటే ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా ఉంటుంది.. అని అస్సలు అనుకోవడానికి వీల్లేదండి. మీ బాగోతం మొత్తం మీ పాత నెంబర్ తీసుకున్న కొత్త వ్యక్తికి తెలిసిపోతుందట. దీన్ని రుజువు చేస్తూ అందుకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

సాధారణంగా ఓ నెంబర్‌ని కొంత కాలం పాటు వాడకుండా మూలన పడేస్తే, దాన్ని ఇతరులకు కేటాయించే హక్కు టెలికాం కంపెనీలకు ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మరి ఈ కొత్త ట్విస్ట్ ఏంటంటే.. అప్పట్లో ఆ నెంబర్ నుంచి ఎవరితో ఛాటింగ్ చేసామో ఆ ఛాట్ హిస్టరీ మొత్తం ఆ నెంబర్ కొత్తగా ఇవ్వబడిన కొత్త వ్యక్తికి తెలిసిపోతుందట.

అలా ఎలా జరుగుతుందని ఆరా తీస్తే.. గూగుల్ లేదా ఫేస్‌బుక్ వంటి అకౌంట్ల ఆధారంగా కాకుండా వాట్సప్ కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా పని చేయడం వలన, మనం చేసే ఛాట్ సంభాషణలు మన ఫోన్ నెంబర్‌తో లింక్ చేయబడి ఉంటున్నాయి. వాట్సప్‌కు సంబంధించిన డేటా మొత్తం ఫోన్‌లో గానీ, లేదా మన గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లో గానీ బ్యాకప్ తీయబడుతూ ఉంటుంది తప్పించి వాట్సప్ సర్వర్‌లో డెలివరీ చెయ్యబడని కొద్ది మొత్తంలో డేటా మాత్రమే ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఎలా చోటు చేసుకుంటున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. లేదంటే మన ఛాట్ సంభాషణ మొత్తం వాట్సప్ దగ్గర ఉంటున్నాయేమో అన్న అనుమానం కూడా వస్తోంది.

ఏది ఏమైనా ఇకపై వాట్సప్ సంస్థ పాత నెంబర్ తొలగించి కొత్త నెంబర్‌కి మారాలనుకునే వారు యాప్ ఓపెన్ చేసి Change Number అనే ఆప్షన్ ద్వారా తమ అకౌంట్ మొత్తాన్ని కొత్త నెంబర్‌కి మైగ్రేట్ చేసుకుంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని సలహా ఇస్తోంది. తనకు ఇలాగే జరిగిందని అబే ఫుల్లర్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

Recommended For You