కోహ్లీ.. కాస్త మీ ఆవిడని.. ఆ యాడ్‌‌లో..

అందాల తారలు అందంగా చెబితే చేసేస్తారా ఏమిటి.. నచ్చితేనే కదా అంటే.. అయ్‌ బాబోయ్ అలా అనకండి. పావలా ప్రొడక్ట్‌కి పాతిక లక్షలు ఖర్చు బెట్టి యాడ్ ఇస్తాము. దాన్ని మీరు వాడకపోతే మా బతుకు బస్టాండవుతుంది. వ్యాపారం ఎలా చేసుకుంటాం చెప్పండి. అసలు సిసలైన వ్యాపార సీక్రెట్ అదేనండి. తమకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ ఆ ప్రొడక్ట్ వాడుతున్నారంటే జనం ఎగబడి కొనేస్తారనేగా.. అన్ని లక్షలు ఖర్చుపెట్టేది. మరి మీరు ఇలా అంటే ఎలా..

తాజాగా బాలీవుడ్ భామ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. అనుష్క ఓ పాన్ యాడ్‌లో నటించి దానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ వారి సీరియస్‌నెస్‌కి కారణమేంటని విచారిస్తే.. పాన్ మసాలాలు అమ్మే రజనీ గంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ను అనుష్క ప్రమోట్ చేస్తోంది.

పెటాతో చేతులు కలిపి మాంసాహారానికి దూరంగా ఉండమని ప్రచారం చేస్తున్న ఆమె.. ఇప్పుడు మాత్రం ఇలా ఓ గుట్కా యాడ్‌లో నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గుట్కా, పాన్ మసాలాలతో ఎంతో మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరి అలాంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు భావ్యం అని మండిపడుతున్నారు.

ఓ పక్క ఆమె భర్త కోహ్లీ ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలా సుపారీలు తింటూ నీతులు భోధించడం సరికాదంటున్నారు. మరో నెటిజన్ కాస్త వ్యంగ్యంగా.. మేడమ్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు.. ఇలాగే నోటి క్యాన్సర్ భారిన పడిన వారికి కూడా అండగా నిలుస్తారా.. ఈ యాడ్ చూసిన కొన్ని లక్షల మంది మీ అభిమానులు ఈ పాన్ తిని అదే క్యాన్సర్ బారిన పడతారు అని ఘాటుగా విమర్శిస్తూ కామెంట్ చేశారు. మరి వీటన్నింటిని చూసిన విరుష్కల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Recommended For You