ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి లైక్స్ కొట్టించుకోవాలని 11వ అంతస్తు నుంచి..

చేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఎంత సేపు ఏదో ఒక అడ్వంచర్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడదామా అని చూస్తున్నారే కానీ.. దాని వలన జరగరానిది ఏదైనా జరిగితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవనే విషయం అర్థం కావట్లేదు.

సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల గురించి ఆలోచిస్తున్నారే కానీ అమ్మానాన్నల గురించి ఆలోచించట్లేదు. ముఖ్యంగా బంగారంలాంటి తమ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించట్లేదు. తనతో పాటు మరో నలుగురికి ఉపయోగపడే మంచి పని చేస్తే కనీసం సంతృప్తి అయినా మిగులుతుంది కదా.. ఏంటి ఈ పిచ్చి పనులు అంటూ నెటిజన్స్ అతడు చేసిన పనికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇంతకీ అతడేం చేశాడో.. వాషింగ్టన్‌కు చెందిన 27 ఏళ్ల నికోలాయ్ నేదేవ్ బహుమాస్ లోని నాసౌలోని రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్ ఎక్కాడు. అతడితో పాటు మరి కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అందరూ కలిసి క్రూజ్‌లోని 11వ అంతస్తుకు చేరుకున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, సముద్రపు అందాలను అంతెత్తునుంచి వీక్షిస్తూ తమని తాము మరచి పోయారు.

ఇక్కడి నుంచి దూకేస్తే అని నికోలాయ్ అన్నాడో లేదో.. స్నేహితులు మరెందుకు ఆలస్యం అంటూ అతన్ని ప్రోత్సహించారు. దూకేంత వరకు రెచ్చగొట్టారు. అంతే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంతెత్తునుంచి సముద్రంలోకి దూకేశాడు. అదృష్టం బావుండి అతడు బతికి బయటపడ్డాడు. ఈ దృశ్యం మొత్తం స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే విషయం తెలుసుకున్న క్రూజ్ షిప్ అధికారులు నికోలాయ్‌పైన, అతడి స్నేహితులపైనా మండి పడ్డారు. ఇంక జీవితంలో తమ షిప్ ఎక్కవద్దంటూ వారిపై నిషేధం విధించారు. తాను చేసిన తప్పుకి వివరణ ఇచ్చుకున్న నికోలాయ్ అంతకు ముందు రోజు రాత్రి తాగిన మందు మత్తు ఇంకా దిగలేదని, అందుకే 11 వ అంతస్తునుంచి దూకినట్లు చెబుతున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు వేలకొద్దీ కామెంట్స్ వచ్చినా.. అందులో అతడిని తిడుతూ వచ్చిన కామెంట్సే ఎక్కువ వున్నాయి.

View this post on Instagram

Full send

A post shared by Nick Naydev (@naydev91) on

Recommended For You