ఆనంద్ మహీంద్రాకు నచ్చిన ఆంటీ, అంకుల్..

కష్టపడితే కలలను సాకారం చేసుకోవచ్చు. ఇష్టంగా కష్టపడితే ఇతర దేశాలన్నీ చుట్టేయొచ్చు. మనసులో కోరిక ఉండాలే కాని వయసుతో పనేముంది. చేసేది పెద్ద వ్యాపారం కూడా కాదు. అయితేనేం.. అందులోనే కొంత పొదుపు చేసి దేశాలన్నీ చుట్టేస్తున్నారు ఆ ఆలూమగలిద్దరూ. అందుకే ఆనంద్ మహీంద్రాకు వారిద్దరూ తెగ నచ్చేశారు. వారిని ప్రశంసలతో ముంచెత్తారు. స్ఫూర్తిదాయకంగా ఉండే విషయాలపై స్పందిస్తూ తన అభిప్రాయాల్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకునే మహీంద్రకు అంతగా నచ్చేసిన ఆ ఆంటీ, అంకుల్ గురించి మనమూ తెలుసుకుందాం..

కేరళలోని కొచ్చికి చెందిన విజయన్, మోహనలు ‘శ్రీ బాలాజీ కాఫీ హౌస్’ అని టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే కొచ్చి గడప దాటని భార్యకి ప్రపంచాన్ని చూపించాలనుకున్నారు విజయన్. పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. అయినా ఉన్నదాంట్లోనే సర్థుకుపోతూ తమ కోర్కెను నెరవేర్చుకోవాలనుకున్నారు. అందుకోసం టీ అమ్మగా వచ్చే డబ్బులో నుంచి రోజూ రూ.300 వరకు దాచి ఉంచేవారు.

ముందుగా ప్రణాళికను సిద్దం చేసుకునేవారు. ఎక్కడికి వెళ్లాలి. ఎలా వెళ్లాలి. ఎన్ని రోజులు ఉండాలి. ఎంత ఖర్చవుతుంది. ఇలాంటి విషయాలన్నీ తెలిసిన వారిని అడిగి తెలుసుకునే వారు. తమకున్న కొద్ది పాటి ఆస్థిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి లోన్ తీసుకునే వారు. దాంతో పాటు వారు జమ చేసిన మొత్తాన్ని కలిపి తాము వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్లేవారు. ఒక దేశం చూసి వచ్చిన తరువాత దానికి సంబంధించిన రుణం తీర్చేసి తరువాత మరో దేశం వెళ్లడానికి ప్లాన్ చేసుకునే వారు. ఇలా తమ 45 ఏళ్ల వైవాహిక జీవితంలో మొత్తం 23 దేశాలు చుట్టి వచ్చారు.

నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ వృద్ద దంపతులు 1963 నుంచి టీ స్టాల్ నడుపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. తమ సక్సెస్ సీక్రెట్ గురించి విజయన్ వివరిస్తూ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ప్రపంచం మొత్తం చుట్టి రావాలనేది నా చిన్ననాటి కోరిక. అందుకు నాభార్య సహకారం కూడా ఎంతో ఉంది. ఊరు దాటి బయటకు అడుగుపెట్టని ఆమెకు ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పిస్తున్నాను. ఆరోగ్యం సహకరించేంతవరకు వీలైనన్ని ఎక్కువ దేశాలు చుట్టి రావాలన్నది మా కోరిక.

టీ స్టాల్‌లో పని వాళ్లను కూడా పెట్టుకోకుండా మా పని మేమే చేసుకుంటామని చెబుతున్నారు. దుకాణంలోని గోడలపై వారు చుట్టి వచ్చిన దేశాలకు సంబంధించిన ఫోటోలు, వాటి బిల్లులు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను అంటించి ఉంచుతారు. టీ తాగడానికి వచ్చే వారికి వివరిస్తూ ఆ తియ్యని జ్ఞాపకాలను మరో సారి నెమరు వేసుకుంటారు. ఇప్పటివరకు తిరిగిన 23 దేశాల్లో విజయన్‌కు సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూయార్క్ దేశాలు బాగా నచ్చాయట. త్వరలో తాము స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్, గ్రీన్‌ల్యాండ్, నార్వేలు చుట్టి వస్తామని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర‌ కంట పడ్డారు ఈ జంట. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో వారి పేరు కనిపించకపోవచ్చు. కానీ, వారు దేశంలోనే అత్యంత సంపన్నులు. వారి జీవన విధానమే వారి ఆస్తి. నేను ఎప్పుడైనా ఆ నగరానికి వెళితే తప్పకుండా ఆ టీ స్టాల్‌కి వెళ్లి వారి చేతి టీ తాగుతాను అని ట్వీట్ చేస్తూ విజయన్ దంపతులపై రూపొందించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటపై హరిమోహన్ అనే డైరక్టర్ ‘ఇన్విజిబుల్ వింగ్స్’ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. దీనికి 2018 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో నాన్ ఫిక్షన్ విభాగంలో అవార్డు దక్కింది. ఇందులో విజయన్ తన జీవన ప్రయాణం గురించి అందంగా వివరించారు.

Recommended For You