బుజ్జిగాడు భలే కట్‌ చేస్తున్నాడు..అమ్మాయిలంతా క్యూ కట్టేస్తున్నారు..

ఆరేళ్ల అబ్బాయికి ఏం తెలుసు. అమ్మ అన్నం పెడుతుంటే ఇప్పుడే వస్తా అంటూ పక్కింట్లో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరకు పరిగెట్టేస్తాడు. చెల్లిని చూసుకోరా అంటే కొద్ది సేపు బాగానే ఆడించినా.. అమ్మా చెల్లికి నా కారే కావాలంట అని ఏవో కంప్లైంట్లు. మరి వీడేంటి కత్తెర పట్టుకుని చకచకా కట్ చేసేస్తున్నాడు.

అందాలు మెరుగులు దిద్దుకునేందుకు అమ్మాయిలంతా ఆరేళ్ల ఆ బుజ్జిగాడి చేతికి జుట్టందిస్తున్నారు. చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో ఉన్న సూనింగ్ అనే టౌన్‌లోని సెలూన్ దగ్గర ఆడవారు, మగవారు బారులు తీరిన క్యూలో కనిపిస్తారు.

కుదురుగా కూర్చుని హోం వర్క్ చేయడానిక్కూడా అమ్మని సతాయించే వయసున్న పిల్లాడు ఎన్నో సంవత్సరాలు నైపుణ్యం ఉన్న బార్బర్‌లా జుట్టు ట్రిమ్ చేయడం, ఎలక్ట్రిక్ రేజర్లు, ప్లాట్ దువ్వెనతో కటింగ్ చేయడం, డ్రై చేయడం లాంటి పనులన్నీ చేయడం జియాంగ్ హోంగ్ క్వీ కి తెలిసిన విద్యలు.

సీనియర్ హెయిర్ స్టయిలిస్టులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ట్రిమ్ చేస్తుంటే సమ్మగా ఉందంటున్నారు కస్టమర్లు. నాన్న సెలూన్ రన్ చేస్తుంటే రోజూ వచ్చి గమనిస్తుండేవాడట. అల్లరి చిల్లరగా అటూ ఇటూ తిరిగి అదీ ఇదీ పడేయకుండా నాన్న చేసే పనిని చూసి పట్టేసాడు.

పదేళ్ల వయసుకూడా రాకముందే నాన్నకు పోటీ ఇస్తున్నాడు. నాలుగేళ్లనుంచే జియాంగ్ ఈ పని చేయడం మొదలెట్టేసాడు. సోషల్ మీడియాలో తనకో పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన ట్విట్టర్లో 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జియాంగ్ కటింగ్, ట్రిమ్మింగ్ వీడియో వైరల్ అవుతోంది.

Recommended For You