ఏటీఎం ట్రాన్సాక్షన్లు.. అధిక చార్జీల నుంచి బయటపడాలంటే..

ఏటీఎం కార్డు పర్సులో ఉంటే చాలు.. ఎంత కావాలంటే అంత.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఇలాగే అనుకుంటూ కొంచెం కూడా ఎక్కువ మనీ డ్రా చేయం. కార్డు ఉంది కదా అవసరమైనప్పుడు చూసుకోవచ్చులే అని అశ్రద్ధ చేస్తుంటాము.

ఒక్కోసారి మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ఒక బ్యాంకుది అయితే అవసరం కొద్దీ దగ్గరలో ఉన్న మరో బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కి వెళ్లి మరీ డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఎప్పుడంటే అప్పుడు ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేయడం, షాపింగ్ చేయడం, ఆన్‌లైన్ కొనుగోళ్లకు కార్డు ఉపయోగించడం..

ఇలా పరిమితికి మించి కార్డు ఉపయోగిస్తే అదనంగా చార్జీలు పడతాయనే విషయం ఆ సమయంలో అసలు గుర్తుకు రాదు. కొన్ని విషయాలు గమనిస్తే.. కొంతైనా జాగ్రత్త పడొచ్చు.. అవి..
ఏ బ్యాంకులో అయితే అకౌంట్ కలిగి ఉంటామో ఆ బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదు సార్లు, ఇతర బ్యాంకుల ఏటిఎంలలో మూడు సార్లు లావాదేవీలు ఉచితంగా బ్యాంకులు అందిస్తున్నాయి. పరిమితి మించితే మాత్రం చార్జీలు చెల్లించాల్సిందే.

షాపింగ్ చేసే ముందు లేదా డబ్బును మరో ఖాతాలో వేయాలనుకునే వారు ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేస్తుంటారు. ఇలా చేసే బదులు డిజిటల్ పేమెంట్ చేయడం మంచిది. డిజిటల్ వ్యాలెట్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకుంటే మొబైల్ ద్వారానే అవసరమైనప్పుడు చెల్లింపులు చేసుకోవచ్చు.

సాధారణ కస్టమర్లతో పోల్చితే ప్రయారిటీ బ్యాంకింగ్ కస్టమర్లకు బ్యాంకులు పెద్ద పీట వేస్తుంటాయి. అంటే ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు ఏటీఎంలలోనే డబ్బు డ్రా చేయడం, వేయడం లాంటివి చేస్తే అలాంటి కస్టమర్లకు బ్యాంకులు అదనపు సౌకర్యాలను అందిస్తాయి.
అకౌంట్ ఎంత నగదు నిల్వ ఉందో చెక్ చేసుకోవడానికి ఏటీఎం కార్డు ఉపయోగించినా అది కూడా ఒక లావాదేవీగానే పరిగణిస్తుంది బ్యాంకు. అందుకోసం బ్యాంకులు ప్రత్యేకమైన ఫోన్ నెంబర్‌ను అందుబాటులో ఉంచుతున్నాయి.
సంబంధిత బ్యాంకు శాఖలో లేదా బ్యాంకు వెబ్ సైట్ ద్వారా ఈ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

Recommended For You