నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన శివకుమార స్వామిజీ

religious-heads-mourn-death-of-siddaganga-mutt-seer

నడిచే దేవుడిగా ఖ్యాతి పొందిన నూట పదకొండేళ్ల తుమకూరు సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామిజీ సోమవారం శివైక్యం చెందారు. శ్వాసకోశ సమస్యలతో రెండు నెలలుగా చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవల చెన్నై రేలా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం మఠానికి తరలించి, చికిత్స కొనసాగిస్తుండగానే డిసెంబరు చివరి వారంలో ఆయనకు శ్వాస తీసుకోవడం మరోసారి ఇబ్బందికరంగా మారింది. తుమకూరు సిద్దగంగ మెడికల్‌ కళాశాలకు తరలించి కొన్ని రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆయన తనంతట తానుగా మఠానికి వచ్చేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. చెన్నై రేలా, బెంగళూరు బీజీఎస్‌ వైద్యులు హుటాహుటిన మఠానికి చేరుకుని వైద్యసేవలు అందిస్తుండగానే, సోమవారం ఉదయం 11 గంటల 44 నిమిషాలకు స్వామిజీ శివైక్యం చెందారు.

Also read : ఏపీలో జాతీయ రహదారులు, ఆర్వోబీలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన

సిద్దగంగ మఠంలోని వజ్రమహోత్సవ భవన్‌కు అనుబంధంగా ఉండే మ్యూజియం వద్ద పార్థివదేహాన్ని ఉంచారు. స్వామిజీ శివైక్యం చెందినట్టు తెలియగానే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మైసూరు నుంచి హుటాహుటిన సిద్దగంగ మఠానికి చేరుకున్నారు. ప్రతిపక్షనేత యడ్యూరప్ప, మఠం జూనియర్‌ స్వామి సిద్దలింగస్వామి, సుత్తూరు మఠాధిపతితోపాటు కీలక అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వామిజీ శివైక్యం పొందినట్లు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్వామిజీ మహాసమాధి కార్యక్రమం సిద్దగంగ మఠంలో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు, ఇవాళ ప్రభుత్వ సెలవు ప్రకటించారు. స్వామీజీ శివైక్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మఠం ప్రాంగణంలోని విద్యా సంస్థల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఈ సంస్థల్లో 15 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. స్వామిజీ శివైక్యంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సిద్దగంగ మఠం అనగానే విశ్వవిద్యాలయమే గుర్తుకు వస్తుంది. మఠం ప్రాంగణంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల, రెండు ఉన్నత పాఠశాలలు, శిక్షణ కేంద్రం, సంస్కృత కళాశాల, కన్నడ పండితులకు శిక్షణ విభాగం, కామర్స్‌ కళాశాల, అంధుల పాఠశాల, సంగీత పాఠశాల కొలువు తీరాయి. ఈ సంస్థల్లో కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులు చదువుకొంటున్నారు. వీరికి ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నారు. ఇక్కడ చదివిన వారిలో పలువురు ప్రపంచదేశాల్లో కీలక హోదాల్లో ఉన్నారు. పూర్వ విద్యార్థులు, పలు దేశాల ముఖ్యులు ఆహ్వానించినా స్వామిజీ వెళ్లలేదు.

శివకుమారస్వామి 1907 ఏప్రిల్‌ 1న జన్మించారు. మరో రెండు నెలల్లో 112వ ఏట అడుగు పెట్టేవారు. మాగడి తాలూకా వీరాపురలో గంగమ్మ, హొన్నేగౌడలకు 13వ సంతానంగా జన్మించారు. 1922లో అప్పటి సిద్దగంగ మఠాధిపతి శ్రీఉద్దాన శివయోగి వద్ద ఆధ్యాత్మిక సాధన ప్రారంభించారు. బెంగళూరు సెంట్రల్‌ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. రావ్‌ బహద్దూర్‌ గుబ్బితోట ధర్మసత్రంలో ఉంటూ చదువు ను కొనసాగించారు. అదే సమయంలో సిద్దగంగ మఠంతోనూ సంబంధాలు కొనసాగించేవారు. అప్పటి ఉద్దాన శివయోగి 1930లో ఆకస్మికంగా శివైక్యం పొందడంతో మఠం ఉత్తరాధికారిగా శివకుమార స్వామిజీ బాధ్యతలు స్వీ కరించారు. ఆయన తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచేవారు. యోగా, సుదీర్ఘ ఇష్ట లింగ పూజ, గ్రంథాల అధ్యయనం జరిపేవారు.

Recommended For You