మిస్టర్ మజ్ను రివ్యూ..

mr-majnu
mr-majnu

రివ్యూ : మిస్టర్ మజ్ను
తారాగణం : అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్, రావు రమేష్, ప్రియదర్శి, పవిత్రా లోకేష్, ఆది, సితార, జయ ప్రకాష్ తదితరులు
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : జార్జ్ సి విలియమ్స్
సంగీతం : తమన్.ఎస్
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్ : 25.01.19

వారసత్వం ఎంట్రీ కార్డ్ మాత్రమే. ఆ తర్వాత రాణించాలంటే ప్రతిభ, అదృష్టం.. ఈ రెండూ కలిసి ఇచ్చే విజయాలు ఉంటేనే సాధ్యం. తొలి సినిమాతో బాగా నిరాశపరిచి.. మలి సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న అక్కినేని మూడోతరం హీరో అఖిల్.. మూడో సినిమాగా మిస్టర్ మజ్నుతో వచ్చాడు.. ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది..? థర్డ్ మూవీతో అయినా అఖిల్ ను విజయం వరించిందా..? లేదా..?

కథ :

మిస్టర్ మజ్నును కథగా చూస్తే.. విక్కీ(అఖిల్) ఓ ప్లే బాయ్. కనిపించిన ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు. అతన్ని ప్లే బాయ్ గా దగ్గరుండి చూసిన నిక్కీ(నిధి అగర్వాల్)కి అతనంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒక పెళ్లితో ఈ ఇద్దరూ కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రయాణంలో విక్కీ కేవలం ప్లే బాయ్ కాదు.. మంచి జెంటిల్మన్ అని తెలుసుకుని ప్రేమలో పడుతుంది. అప్పటికే చుట్టాలమ్మాయిగా తనూ నిక్కీకి క్లోజ్ అవుతాడు. నిక్కీ తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తుంది. విక్కీ కన్ఫ్యూజ్ అవుతాడు. ఓ రెండు నెలలు బాయ్ ఫ్రెండ్ గాళ్ ఫ్రెండ్ గా ఉందాం అంటుంది. అందుకు ఓకే చెప్పినా.. తన అతి ప్రేమను అర్థం చేసుకోలేకపోతాడు విక్కీ. ఆ విషయంలో హర్ట్ అయిన నిక్కీ అతన్ని తనే వద్దనుకుని వెళ్లిపోతుంది. తను వెళ్లాక తన విలువ తెలిసిన విక్కీ మళ్లీ తన ప్రేమకోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి ఈ ప్రయత్నాల్లో ఈ ప్లే బాయ్ లవర్ బాయ్ గా మారాడా లేదా అనేది మిగతా కథ..

విశ్లేషణ :
మిస్టర్ మజ్ను.. సినిమా గురించి సింపుల్ గా చెబితే ప్లే బాయ్ లవర్ బాయ్ గా మారడం.. అయితే ఈ ప్రేమకథలోకి దర్శకుడు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేయడం బాగా కలిసొచ్చింది. హీరో అంటే ఇష్టం లేని హీరోయిన్ తో అతనితో కలిసి ప్రయాణించేలా రాసుకున్న సీన్స్ బావున్నాయి. అలాగే అతన్లోని మరో యాంగిల్ హీరోయిన్ కు అర్థమయ్యే సన్నివేశాలన్నీ కన్విన్సింగ్ గా ఉంటూనే మంచి ఎమోషన్ ను పండిస్తాయి. కుటుంబంలోని వైవిధ్యమైన మనస్తత్వాలున్న వ్యక్తులు, వారి ఫీలింగ్స్ ను బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. కథంతా హీరో హీరోయిన్ చుట్టూనే తిరిగినా.. వారి కుటుంబాలను కూడా కథలో భాగం చేయడం.. వారి నుంచి అన్ని రకాల ఎమోషన్స్ ను పండించడం ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో తన కజిన్ కు తండ్రి విలువను చెబుతున్నప్పుడు వంటింట్లో నుంచి అతని తల్లి ఎక్స్ ప్రెషన్స్ ను సైమల్టేనియస్ గా క్యారీ చేసిన సీన్ దర్శకుడి అద్భుత ప్రతిభను చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఫన్ అండ్ ఎమోషన్స్, లవ్ అండ్ బ్రేకప్ అంటూ వేగంగా నడిచిపోయిన కథ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కాస్త నెమ్మదిస్తుంది. కొన్ని చోట్ల లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయినా మరీ బోర్ కొట్టేసీన్స్ అయితే లేవు.. దీనివల్ల అక్కడక్కడా లాగ్ అయినా ఆకట్టుకుంటూనే ఉంటాడు మిస్టర్ మజ్ను.
గత రెండు సినిమాల్లో జస్ట్ ఓకే అనిపించిన అఖిల్ ఈ సినిమాతో మెచ్యూర్డ్ గా కనిపిస్తాడు. ప్లే బాయ్ గా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ గా సెకండ్ హాఫ్ లో ఆ పాత్రలో ఒదిగిపోయాడు. బేస్ వాయిస్ కావడం కలిసొచ్చింది. మాడ్యులేషన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ మూవీలో పెద్దగా ఆకట్టుకోని నిధి అగర్వాల్ కు ఈ సారి మంచి పాత్ర పడింది. తనూ బాగా యూజ్ చేసుకుంది. గ్లామర్ కు దూరంగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చూపింది. ప్రియదర్శి పాత్ర బావుంది. ఆది నవ్వించే ప్రయత్నం చేశాడు. రావు రమేష్ ఎప్పట్లానే ఆకట్టుకుంటే ఇతర పాత్రల్లో నాగబాబు, జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, సితార, సుబ్బరాజు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్కికల్ గా ఈ సినిమాకు పెద్ద ప్లస్ తమన్ మ్యూజిక్. పాటలు, నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ నెస్ ను పెంచింది. సెకండ్ హాఫ్ లో ఎడిట్ కావాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఫైట్స్ ఆకట్టుకుంటాయి. మాటలు బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ రేంజ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక తొలిప్రేమతో అలరించిన దర్శకుడు మరోసారి తన స్ట్రెంత్ నే చూపించాడు. లవ్ అండ్ ఎమోషన్ కు బాగా బ్యాలన్స్ చేస్తూ నడిపించిన కథనం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మొత్తంగా ఈ దర్శకుడు ద్వీతీయ విఘ్నం దాటినట్టే అనుకోవచ్చు..

అన్నీ ప్లస్ లేనా అస్సలు మైనస్ లు లేవా అనే డౌట్ రావొచ్చు. నిజమే.. ఇప్పటి వరకూ ప్లస్ లే చెప్పారు కానీ.. మైనస్ ల మాటేంటీ..?అంటే మిస్టర్ మజ్ను లో మైనస్ లు కూడా ఉన్నాయి. హీరో ఎంత ప్లే బాయ్ అయినా ఇలా చూడగానే అలా పడిపోవడం సినిమాటిక్ గానే కనిపిస్తుంది. తన పర్సనల్ విషయాల్లో స్ట్రాంగ్ గా ఉండే హీరో.. హీరోయిన్ అడగ్గానే రెండు నెలలు కలిసుండటానికి ఒప్పుకోవడం అతకలేదు. ఇక సెకండ్ హాఫ్ లో తన కోసం వెంపర్లాడే సీన్స్ లో కొన్ని ఫోర్స్ డ్ గా ఉన్నాయి. అలాగే మరో ప్రధానమైన మైనస్ చాలా చోట్ల విక్టరీ వెంకటేష్, సిమ్రన్ జంటగా నటించిన ‘ప్రేమతో రా’ సినిమా గుర్తుకు రావడం.. కాకపోతే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉన్న కథనం సినిమాకు ప్లస్ కావడంతో మిస్టర్ మజ్ను గట్టెక్కినట్టే అనుకోవచ్చు.

                - బాబురావు. కె.