రూ.లక్ష లంచం ఇవ్వటం కోసం వృద్ధ దంపతులు చేసింది చూస్తే..

లంచం.. లంచం.. లంచం ఇస్తేనే ఈ రోజుల్లో పనికాదు. ఇలానే ఓ అధికారి లంచం ఇస్తేనే పని అవుతుందని ఓ వృద్ధ దంపతులకు తేల్చి చెప్పేశాడు. దీంతో ఆ వృద్ధదంపతులు రోడ్లపై లంచం కోసం భిక్షాటనకు దిగారు. ఇంటింటికి తిరుగుతూ జోలెపట్టారు. ఈ ఘటన జయశంకర్‌ జిల్లా భూపాలపల్లిజిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఆజంనగర్‌ గ్రామానికి చెందిన మాంతు బసవయ్య-లక్ష్మీ అనే వృద్ధ దంపతుల భూమిని.. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అన్యాయంగా వారి పేరు మీద పట్టా చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు తమ న్యాయం చేయాలంటూ గత కొంత కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు తమ భూమిని ఆక్రమించుకున్నారని.. న్యాయం చేయాలని ఎంత మొరపెట్టుకున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.

Also Read : ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

భూమి పట్టా కావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని.. లంచం ఇస్తేనే పనవుతుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. దీంతో తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో భిక్షాటనకు దిగారు వృద్ధ దంపతులు. బ్యానర్లు, ఫ్లేకార్డులు పట్టుకుని జిల్లా కేంద్రంలో వీధి వీధినా తిరిగారు. రూ.లక్ష ఇస్తే తప్పా అధికారులు పట్టా చేయనన్నారని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ భిక్షాటతో అధికారుల మెడలు వంచారు వృద్ధ దంపతులు. భిక్షాటనతో ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు.. వారిని కార్యాలయానికి పిలిపించి భూమి పట్టా అందజేశారు. లంచం అడిగే వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పి అందరికి స్ఫూర్తిగా నిలిచారు వృద్ధ దంపతులు.