3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు

telangana panchayiti second phase poling today

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 10 వేల 668 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో మొత్తం 4వేల 137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3 వేల 342 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.

Also read : చీల్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ44

మొదటి విడతలో వినియోగించిన బ్యాలెట్‌ పెట్టెలనే ఈ విడతలోనూ వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో పాల్గొన్న పోలింగ్‌ సిబ్బందే రెండో విడతలోనూ విధులు నిర్వహిస్తారు. మొదటి విడతలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేసింది. కొత్తగా తీసుకుంటున్న చర్యలతో చెల్లని ఓట్ల సంఖ్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

రెండో విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం హోరెత్తింది. గత కొద్ది రోజులుగా మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల అధికారులు 3 లక్షల 48వేల రూపాయల విలువైన 14వందల 46 లీటర్ల మద్యం ఒక్క బుధవారమే స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 36 లక్షల 27 వేల రూపాయల విలువైన మద్యం పట్టుబడింది. వనపర్తిలో సరైన లెక్కలు లేకుండా తరలిస్తున్న 19 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడిన నగదు మొత్తం 1 కోటీ 78 లక్షలకు చేరింది. ఇంతవరకు 289 ఫిర్యాదులు అందగా… 288 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్‌ ఈ నెల 21వ ముగిసింది. రెండో విడతకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మూడో విడతగా 30న ఎన్నికలుంటాయి.