ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి

leopard dies in adilabad distric

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి కలకలం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం చిరుత పులి మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే మరొకటి వెలుగుచూసింది. మందమర్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంట్లో పెద్దపులి చర్మం దొరకడంతో విచారణ చేపట్టారు. మందమర్రిలోని గౌతమ్‌నగర్‌లో నివసించే ఐలవేని లింగయ్య ఇంట్లో పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ అధికారులు. పులి చర్మం అతడికి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ ముమ్మరం చేశారు. అతని వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఫారెస్ట్‌ అధికారి వెంకటేశ్వరరావు. ఎన్జీవో ఆర్గనైజేషన్‌ సహకారంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Also read : వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్

అంతకుముందు ఇచ్చోడలో అమ్మకానికి తరలిస్తున్న పులిచర్మాన్ని అటవీ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కవ్వాల్ ఫారెస్టులోనే టైగర్ జోన్ లో పులిని చంపినట్టు నేరాన్ని అంగీకరించారు. అయితే ఇందులో ఇంకా విస్తుగొలిపే విషయం ఏంటంటే.. ఏడాది క్రితమే ఈ పులిని హతమార్చారు. పెంబి మండలం పులిగ్రామ్ పాండ్రీ అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌ తగిలేలా ఉచ్చులు పెట్టి పులిని హతమార్చారు. మూడేళ్ల వయసున్న ఈ పులి 2017లో జన్నారం ఫారెస్టు రేంజిలో అటవీ శాఖ అధికారుల కెమెరాకు చిక్కింది. ఇదే వేటగాళ్ల ఉచ్చుకు బలిఅయినట్టు పులిచర్మం ఆధారంగా గుర్తించారు.

ఏడాది క్రితం చంపిన వేటగాళ్లు… చర్మం, గోళ్లు తీసుకుని మృతదేహాన్ని కాల్చి బూడిదచేశారు. సమీపంలోని కాలువలో పడేశారు. ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఈ ఘటన మొదటిది కాదని.. ఇంకా చాలా పులులను చంపిఉంటారని తెలుస్తోంది. ఈకోణంలో విచారణ జరుపుతున్నారు. గతంలో కెమెరాలకు చిక్కిన పులులు తర్వాత మాయమవుతున్నాయి. వాటి కాళ్ల ముద్రలు కూడా కనిపించడం లేదు. దీంతో కవ్వాల్ టైగర్ పారెస్టులో పెద్దెత్తున పులుల వేట సాగుతున్నట్టు అనుమానిస్తున్నారు.

గత కొంతకాలంగా పులులు హత్యకు గురౌతున్నా కనీసం అధికారులకు ఆధారాలు లభించలేదు. నిఘా వైఫల్యంవల్లే వేటగాళ్లు యథేచ్చగా కవ్వాల్ ఫారెస్టులో రెచ్చిపోతున్నారు. సమగ్ర విచారణ జరపాలని జనాలు కోరుతున్నారు.. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.. టైగర్ జోన్ పేరుతో వందల కోట్ల నిధులు వస్తున్నా.. పులులకు అవసరమైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. కనీసం వాటిని వేటగాళ్ల భారీన పడకుండా కాపాడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకే మణిహారంగా ఉన్న కవ్వాల్ టైగర్ జోన్ లో పులలను కాపాడాలని.. వేటగాళ్లపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు సమీప గ్రామాల ప్రజలు.

One thought on “ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుత పులుల మృతి”

Comments are closed.