రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు

second phase panchayiti election results

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది.. మొదటి విడత తరహాలోనే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ కండువ పల్లెల్లో రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన 2610 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన వారిలో 835మంది గెలిచారు. టీడీపీ 39, బీజేపీ 37, సీపీఎం 21, సీపీఐ 12, ఇతరులు 561 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం సాధించారు.ఈ లోకల్ పోరులో బీజేపీ, టీడీపీలు ప్రభావం అంతంత మాత్రంగానే కన్పించింది.

Also read : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

మొత్తం 4,137 పంచాయతీలకు రెండో విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3342 సర్పంచ్‌ పదవులు, వాటి పరిధిలోని 26,191 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహించారు..

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.26శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రిలో అత్యధికంగా 83.71 పోలింగ్, అత్యల్పంగా జగిత్యాలలో 80.23 శాతం పోలింగ్ నమోదైంది. 10 జిల్లాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం సర్వ గ్రామంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్‌ సిబ్బందిపై స్థానికులు దాడికి యత్నించారు. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి పాలైన అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రంలో సామగ్రిని ధ్వంసం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు సర్వ గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 2629, కాంగ్రెస్ 920, టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 స్థానాల్లో సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. తొలి, రెండవ విడతల్లో కలిపి 5,239 సర్పంచ్ స్థానాలను టీఆర్ఎస్ తన ఖాతాలో వెసుకుంది.. మొత్తానికి అక్కడక్కడ చిన్న పాటి ఉద్రిక్తత పరిస్థితులు మినహా మొదటి , రెండవ విడతల పోలింగ్ ప్రశాంతం ముగిసింది.

One thought on “రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు”

Comments are closed.