ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న కేబినేట్‌ విస్తరణకు అవకాశం

cm KCR drop birthdays celebrations over pulwama terror attack

తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టిన చండీ యాగం ముగియడంతో ఇప్పుడు అంతా మంత్రి పదవుల యాగంపై పడింది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఖాయమంటున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలి వారం కేబినెట్‌ విస్తరణ జరగవచ్చన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. కేబినెట్ విస్తరణకు తమ అధినేత కేసీఆర్ డేట్స్ ఫిక్స్ చేసినట్టుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో జోరుగా చర్చ జరుగుతోంది. మొదట 10 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి.. లోక్‌సభ ఎన్నికల తరువాత మరో ఆరుగురిని తీసుకొనే అవకాశం ఉందంటున్నారు నేతలు.

Also read : కేసీఆర్,కేటీఆర్ లతో పవన్ మంతనాలు

కేసీఆర్‌ సర్కార్‌ కొలువుతీరి 45 రోజులు గడిచినా పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువు తీరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే ప్రస్తుతం కెబినేట్‌లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై గతంలో పలు ఊహాగానాలు వినిపించగా మంత్రి పదవుల కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు, తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టినా సహస్ర మహా చండీయాగంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు విడతల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. 30న మూడో దఫా జరగనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ఊహాగానాలు ఇప్పుడు జోరందుకున్నాయి.

ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న మంచి మూహూర్తం ఉండడంతో కేబినేట్‌ విస్తరణకు అవకాశం ఉందని అంటున్నారు. మార్చి తొలివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఆలోగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అంతకు ముందే ఫిబ్రవరి తొలివారంలో మండలి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ తరుణంలో పెద్దల సభ ఎన్నికల ప్రకటనకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

One thought on “ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న కేబినేట్‌ విస్తరణకు అవకాశం”

Comments are closed.