అమెరికా అధికారుల మాస్టర్ బ్రెయిన్..అడ్డంగా బుక్కైన స్టూడెంట్స్

Detention Of Indian Students

నకిలీ యూనివర్సిటీలో చేరి మోసపోయిన భారతీయ విద్యార్థులకు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అండగా నిలుస్తోంది. విద్యార్థులకు సాయం చేసేందుకు 24 గంటల పాటు పనిచేసే హాట్‌లైన్‌ను ప్రారంభించింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఓ నోడల్‌ అధికారిని కూడా నియమించింది.

విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసేవారిని వలపన్ని పట్టుకోవడానికి అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. మిచిగాన్ రాష్ట్రంలో ఫార్మింగ్‌టన్‌ హిల్స్‌లో ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డెట్రాయిట్‌ ప్రాంతంలోని ఒక చిన్న భవనంలో దీన్ని నిర్వహించారు. వర్సిటీకి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ విషయం తెలియని 8 మంది ఈ వర్సిటీలో 600 మందికిపైగా విద్యార్థులను అక్రమంగా చేర్చేందుకు ప్రయత్నించి, అధికారుల వలలో చిక్కారు. నకిలీ విద్యార్థి వీసాలతో అక్రమంగా ఉంటున్న 130 మంది విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నామని, వీరిలో 129 మంది భారతీయులేనని అధికారులు తాజాగా వెల్లడించారు.

అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు ప్రారంభించిన ఫార్మింగ్‌టన్‌ యూనివర్శిటీ నకిలీదని విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఫెడరల్‌ అధికారుల తీరును తప్పుబట్టారు. అమెరికాలో కొన్ని యూనివర్శిటీలు తొలి రోజునుంచే కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తాయని, ఇది కూడా అలాంటిదేనని భావించి విద్యార్థులు చేరినట్లు తమకు తెలిసిందంటున్నారు.

మరోవైపు నకిలీ యూనివర్సిటీ బారిన పడ్డ విద్యార్థులకు సహాయం చేయడానికి నాట్స్ ముందుకు వచ్చింది. ఓ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. దీనిద్వారా న్యాయపరమైన సహాయం చేస్తామని నాట్స్ ప్రతినిధులు చెప్పారు

ఇంకోవైపు అమెరికాకు ఆషామాషీగా రావొద్దని విద్యార్థులకు సూచిస్తున్నారు మరికొందరు. ఒకసారి చిక్కుల్లో పడితే కష్టమని చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Recommended For You