ఎఫ్‌డీలకంటే ఎక్కువ వడ్డీ వచ్చే ప్రభుత్వ బాండ్లు.. అవి..

కష్టపడి సంపాదించిన సొమ్ము పిల్ల పెళ్లికో.. పిల్లాడి చదువుకో ఉపయోగపడుతుందని కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకుల్లో భద్రపరుస్తుంటారు. భరోసాతో పాటు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. మన సొమ్ము బ్యాంకులో భద్రంగానూ ఉంటుంది.

మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే అవసరాన్ని బట్టి తీసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే, వడ్డీ పరంగా చూస్తే వీటిల్లో పెద్దగా వడ్డీ రాదు. వేరే ఏమైనా పెట్టుబడులున్నాయా అని ఆలోచించేవారికి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే బాండ్ల వైపు దృష్టి సారించవచ్చు.

వీటిపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుంది. వీటిలో భద్రత కూడా ఎక్కువే. కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. ఆరేళ్లపాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, అత్యవసరంగా డబ్బులు కావాలంటే మాత్రం తీసుకోవడానికి ఉండదు. పీరియడ్ పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిందే.

కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన నిధులను డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంటాయి. వీటిలో పెట్టుబడులుఎంత భద్రమో తెలియజేసేందుకు వీలుగా అవసరమైన రేటింగ్ సంస్ధలు డిపాజిట్‌లకు రేటింగ్ ఇస్తుంటాయి.

కార్పొరేట్ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకు సాధారణ ఎఫ్‌డీల కంటే ఒకటి రెండు శాతం అదనంగా పొందవచ్చు. ఉదాహరణకు డిపాజిట్లపై శ్రీరామ్ ట్రాన్స్‌ పోర్ట్ ఫైనాన్స్ 8.19% వరకు వడ్డీరేటును ఆఫర్ చేస్తుంది. 7 రోజుల డిపాజిట్లు మొదలుకొని 10 ఏళ్ల డిపాజిట్లను అందుబాటులో ఉంచిన బంధన్ బ్యాంకు వడ్డీ రేటును 3.5% నుంచి 8% వరకు అందిస్తుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ రేట్లు కూడా బ్యాంకు ఎఫ్‌డీల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వాటిలో ఒకటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఐదేళ్ల కాల పరిమితిలో 8 శాతం వడ్డీ వస్తుంది. అధిక శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి కూడా పన్ను తర్వాత నికర రాబడి 5.6 శాతంగా ఉంటుంది.

రెండోది కిసాన్ వికాస పత్రం.. ఇది దీర్ఘకాలిక్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం.. 9 ఏళ్ల నాలుగు నెలల్లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. మూడోది పీపీఎఫ్ పైన కూడా ఆకర్షణీయమైన వడ్డీరేటు లభిస్తుంది. 8 శాతం వడ్డీ రేటు లభించినా దానిపై ఎలాంటి పన్ను లేకపోవడంతో నికర రాబడి ఎక్కువగా ఉంటుంది. డెట్ ఫండ్స్ బ్యాంకు ఎఫ్‌డీల కంటే డెట్ ఫండ్స్ ద్వారా ఎక్కువ రాబడులు సాధించవచ్చు.

లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ నిధులను వెనక్కి తీసుకోగల సౌలభ్యం డెట్ ఫండ్స్‌లో ఉంటుంది. కానీ ఇది కూడా ఫండ్‌ను బట్టి మారిపోతుంటుంది. దీనిపై వచ్చే రాబడులు మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. మంచి పనితీరున్న ఫండ్ మేనేజర్ ఆధ్వర్యంలో డెట్ ఫండ్‌ని ఎంచుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ డెట్ ఫండ్లను కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిపాజిట్లు, మనీ మార్కెట్ సాధనాల్లో ఉంటాయి. ఏడాది కాల వ్యవధిగల డిపాజిట్లపై వివిధ రకాల కేటగిరీల్లో 7 శాతం నుంచి 9 శాతం వరకు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై 9.50 శాతం వరకు రాబడులకు అవకాశం ఉంది.

ఇందులో మూడు రకాల ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి.
ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్: ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిది. నిర్ణీత కాలం వరకు డబ్బులను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధులతో ఉంటాయి.
కార్పొరేట్ బాండ్ ఫండ్: అంటే అధిక, అత్యధిక రేటింగ్ గల కంపెనీలు జారీ చేసే బాండ్లు. అధిక భద్రతతో మెరుగైన రాబడులు అందించేందుకు వీలున్న బాండ్లు ఇది. ఇందులో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్: కార్పొరేట్ బాండ్ల తరహావే. కాకపోతే అధిక రాబడులను ఇచ్చేందుకు వీలుగా తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్.
ఈఎల్ఎస్ఎస్: పన్ను మినహాయింపు ప్రయోజనాల కోసమే కొన్ని మ్యూచువల్ ఫండ్లు ఉంటాయి. వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను విషయంలో రూ.1.5 లక్షవరకు మినహాయింపు పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లోని వివిధ కంపెనీల షేర్లలో పెడతారు. కొంత నష్ట భయాన్ని తట్టుకోగలిగితే ఈఎల్ఎస్ఎస్ పథకాలు సరైన ఎంపిక.

Recommended For You