ఇంగ్లాండ్ ఓడితే ఇండియానే నెంబర్ వన్..

india-team

-కన్నెగంటి

అవును. ఇది నిజంగా నిజమే. ఏ ఆటలోనైనా నెంబర్ 1 ర్యాంక్ సాధించాలంటే ఆ జట్టు ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించాల్సిందే. అయితే అసలు బరిలోకి దిగకుండానే, ఒక్క బంతినైనా ఆడకుండానే ప్రపంచ నెంబర్ 1 జట్టుగా నిలిచే సువర్ణావకాశం భారత జట్టును తెగ ఊరిస్తోంది. వెస్టిండీస్ లో ఇంగ్లండ్ ఆడనున్న 5 వన్డేల ద్వైపాక్షిక సిరీస్ టీమిండియాకు ఈ ఛాన్స్ కల్పించబోతోంది.

ప్రస్తుతం టీమిండియా ప్రపంచ వన్డే ర్యాంకింగులలో రెండో స్థానంలో వుంటే, ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ జట్టు 126 పాయింట్లతో వుండగా నాలుగు పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 122 పాయింట్లతో రెండో స్దానంతో సరిపెట్టుకుంది. వెస్టిండీస్ టీమ్ ఇంగ్లండ్ ను 3-2 , లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడిస్తే టీమిండియా పంటపండుతుందన్న మాటే.

ఇంగ్లండ్ జట్టును ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో 2-0 తేడాతో మరో టెస్టు మిగిలి వుండగానే వెస్టిండీస్ చిత్తుగా ఓడించి, సిరీస్ విజయం సాధించింది. అదీ రెండో టెస్టులో మూడోరోజే ఇంగ్లండ్ టీంను వెస్టిండీస్ చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో మంచి ఫామ్ లో వున్న వెస్టిండీస్ జట్టు వన్డేల్లోనూ అదే ఫీట్ రిపీట్ చేయగలిగితే, వెస్టిండీస్ కు సిరీస్ విజయం- టీమిండియా కు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ దక్కుతాయి.

ఇంగ్లీషు టీం కనీసం 3-2 తేడాతో ఓడినా ఆజట్టు పాయింట్లు 126 నుంచి 121కి పడిపోతాయి. టీమిండియా పాయింట్లలో మార్పులేకున్నా ఒకే ఒక పాయింట్ తేడాతో వన్డేల్లోనూ ప్రపంచ నెంబర్1ర్యాంక్ మనకే దక్కుతుంది. టెస్టుల్లో ఇప్పటికే నెంబర్1గా నిలిచిన భారతజట్టు “డబుల్ ” సాధించినట్టవుంది. ఒకవేళ వెస్టిండీస్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ జట్టే గెలుచుకుంటే కొద్దిరోజుల్లో మనగడ్డపైనే ఆస్ట్రేలియాతో జరగనున్న 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తేనే నెంబర్ 1 ర్యాంక్ చేజిక్కుతుంది. అయితే ఆస్సీస్ ను 5-0తేడాతో చిత్తు చేయడం అంత తేలిక కాదు కనుక ఇంగ్లండ్ జట్టును వెస్టిండీస్ ఓడించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అప్పుడు నెంబర్ 1 ర్యాంక్ తో ఆస్ట్రేలియాను మరింత తేలికగా ఎదుర్కోవచ్చని, నెంబర్ 1 ర్యాంక్ ను పదిలం చేయవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఏదిఏమైనా వరల్డ్ నెంబర్ 1 జట్టుగా కొద్దినెలల్లోనే ఇంగ్లండ్ లో జరగనున్న ప్రపంచ కప్ బరిలోకి దిగితే, ఆ మజానే వేరంటున్నారు భారత అభిమానులు.

Recommended For You