భారత మహిళా T20 జట్టు ఓటమి

India women vs New Zealand women 1st T20

మొన్ననే ముగిసిన వన్డే సిరీస్ పరాజయానికి న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. వెల్లింగ్టన్ వెస్ట్ పాక్ స్టేడియంలో నేడు మొదలైన మూడు మ్యాచ్ ల T20 టోర్నీ మొదటి మ్యాచ్ లోనే టీమిండియాను ఓడించి, 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ డివైన్ (48 బంతుల్లో 62 పరుగులు),కెజె మార్టిన్(14 బంతుల్లో 27 పరుగులు), కెప్టెన్ అమీ సత్తెర్త్ వెయిట్(27 బంతుల్లో 33 పరుగులు) సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు సాధించింది. ఓవర్ కు 8 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ నాలుగు పరుగులకే ఓపెనర్ పునియా వికెట్ ను కోల్పోయింది. రెండో వికెట్ కు స్మృతి మందాన, రోడ్రిగ్స్ 98 పరుగుల భారీ భాగస్వామ్యంతో చెలరేగడంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించింది. అయితే కేవలం ఒక్క పరుగు వ్యవధిలోనే వారిరువురు పెవిలియన్ చేరడంతో టీమిండియా బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Also Read : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఇంటర్ బాలికను దారుణంగా..

స్మృతి మందాన (34 బంతుల్లో 58 పరుగులు) జట్టు స్కోరు 102 పరుగుల వద్ద వికెట్ కోల్పోగా, 103 పరుగుల వద్ద రోడ్రిగ్స్ ( 33 బంతుల్లో 39 పరుగులు) పెవిలియన్ చేరింది. అక్కడి నుంచి టపటపా వికెట్లు రాలిపోవడంతో భారత జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది.

న్యూజిలాండ్ బౌలర్ తహుహు 3వికెట్లు, కస్పరెక్ , కెర్ రెండేసి వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. ఆ జట్టు కెప్టెన్ అమీ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లోనూ ప్రతిభ చూపింది. తొమ్మిది బంతులే వేసిన అమీ కేవలం మూడు పరుగులే ఇచ్చి ఓపెనర్ పునియా వికెట్ పడగొట్టి జట్టుకు శుభారంభం ఇచ్చింది. ఇరు దేశాల మహిళా జట్లను న్యూజిలాండ్, భారత పురుషుల జట్ల ఆటగాళ్లు ఆట జరిగినంతసేపు చప్పట్లతో ఉత్సాహపరిచారు.

ఇదే స్టేడియంలో న్యూజిలాండ్- భారత పురుషుల జట్ల మధ్య మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్న టి 20 మ్యాచ్ కోసం వారు అక్కడ వుండడం విశేషం. మహిళలు, పురుష జట్ల మధ్య కూడా మూడు టి 20 మ్యాచ్ లు ఒకేరోజు ఒకే నగరాల్లో అవే స్టేడియాలలో జరగనుండడం మరీ విశేషం. ఈ జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ లు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ స్టేడియంలో 8వ తేదీన, మూడో మ్యాచ్ 10 వ తేదీన హామిల్టన్ లోని సెడామ్ స్టేడియంలో జరగనున్నాయి.

Recommended For You