టి20 ల్లో ఓడిన భారత జట్లు

india new zealand t20 match lost both women and men

కన్నెగంటి

న్యూజిలాండ్ లో నేడు ప్రారంభమైన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభ మ్యాచ్ లు భారత జట్లకు అచ్చిరాలేదు. వెల్లింగ్టన్ వెస్ట్ పార్క్ స్టేడియంలో ఆతిథ్య జట్లతో తలపడిన భారత పురుషులు, మహిళల టి20 జట్లు రెండూ పరాజయం పాలయ్యాయి. భారత జట్ల నేటి ఆటల్లో వ్యూహాలు, పరాజయాలు ఒకే తీరుగా సాగడం విశేషం. రెండు జట్లూ టాస్ గెలిచి, మ్యాచ్ లను కోల్పోయాయి. అలాగే భారత జట్లు రెండూ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని, ప్రత్యర్థిని బ్యాటింగ్ కు దింపి ఓటమిని కొనితెచ్చుకున్నాయి. ఛేజింగ్ లో చతికిల పడడంతో రెండు జట్లూ పరాజయం పాలయ్యాయి. అలాగే రెండు జట్లూ ఒకే స్టేడియంలో ఒకేరోజు ఓటమిచెందడం విశేషం.

Also read : టీట్వంటీ సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం

వెస్ట్ పాక్ స్టేడియంలో ముందుగా న్యూజిలాండ్- భారత మహిళల జట్లు మొదటి మ్యాచ్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ మహిళా జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో మెరుపులు మెరిపించి భారత్ కు చుక్కలు చూపించింది. భారత మహిళా బ్యాటర్లు కేవలం ఒక్క వికెట్ నష్టానికి 100 పరుగులతో వున్న పటిష్ట స్థితి నుంచి వికెట్లు చేజార్చుకుని పరాజయం కొని తెచ్చుకున్నారు. చివరి తొమ్మిది వికెట్లను 35 పరుగుల వ్యవధిలో ప్రత్యర్థికి సమర్పించుకున్నారు. భారత బ్యాటర్లను చకచకా పెవిలియన్ కు పంపించిన ఆతిథ్య జట్టు బౌలర్లు పండగ చేసుకున్నారు. మొన్నటి వన్డే సిరీస్ ఓటమికి కొంతైనా ప్రతీకారం తీర్చుకున్నారు. అనంతరం అదే స్టేడియంలో పురుషుల జట్లూ బరిలోకి దిగాయి. భారత మహిళల జట్టు మాదిరిగానే పురుషుల జట్టూ టాస్ నెగ్గి ప్రత్యర్ధిని ముందుగా బ్యాటింగ్ కు దించి మూల్యం చెల్లించుకుంది.

ఆస్ట్రేలియాలో టెస్టులు, వన్డే సిరీస్ లను గెలిచిన టీమిండియా పురుషుల జట్టు , టి20 సిరీస్ ను సమం చేసింది. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ లోనూ ఘనవిజయం సాధించిన భారత జట్టు అదే న్యూజిలాండ్ పై మొదటి టి 20 లో ఘోరంగా ఓటమి పాలైంది. ఏకంగా 80 పరుగుల తేడాతో మరీ దారుణంగా చేతులెత్తేసింది. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధిస్తే , టీమిండియా 19.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. కేవలం139 పరుగులు చేయడానికే ఆపసోపాలు పడి, అపజయం పాలైంది.

న్యూజిలాండ్ ఓపెనర్లు షీఫెర్ట్-మన్రో జంట ఓవర్ కు 10 పరుగులకు పైగా రన్ రేటుతో మొదటి వికెట్ కు ఏకంగా 86 పరుగులు చేస్తే, భారత ఓపెనింగ్ జోడీ 18 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగుకే జట్టు స్కోరు 18 వద్ద పెవిలియన్ చేరగా 51 పరుగుల వద్ద మరో ఓపెనర్ ధావన్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.అక్కడి నుంచి మిగతా బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ దారిపట్టడంతో టీమిండియా 139 పరుగుల వద్ద ఆలౌటైంది. భారతజట్టు పక్షాన ధోనీ చేసిన 39 పరుగులే అత్యధిక స్కోరంటే మన బ్యాటింగ్ ఎలా తేలిపోయిందో అవగతమవుతుంది.

వికెట్ నష్టానికి 50 పరుగులు చేసిన దశ నుంచి 89 పరుగులకే చివరి 8 వికెట్లను సమర్పించుకుని, మహిళా జట్టు మాదిరిగా మొదటి మ్యాచ్ ను భారత పురుషుల జట్టు కూడా బంగారు పళ్లెంలో పెట్టి ప్రత్యర్థికి సమర్పించు కుంది. మూడు టి20ల సిరీస్ లో రెండో మ్యాచ్ లు 8వ తేదీన ఆక్లాండ్ లోనిఈడెన్ పార్కులో జరుగుతాయి. అక్కడ కూడా ఇలాగే ముందుగా మహిళా మ్యాచ్, అనంతరం పురుషుల మ్యాచ్ నిర్వహిస్తారు. మూడో మ్యాచ్ లు 10వ తేదీన హామిల్టన్ లోనిసెద్దామ్ పార్క్ స్టేడియంలో జరగనున్నాయి.

Recommended For You