ఆక్లాండ్ లోనైనా అదరగొట్టేనా?

కన్నెగంటి

న్యూజిలాండ్ తో 3 టి20ల సిరీస్ లో వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో వెల్లకిలాపడిన భారత క్రికెట్ జట్లు ఆక్లాండ్ లో రేపు జరిగే రెండో మ్యాచ్ లోనైనా అదరగొట్టాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో రెండో టి20 మ్యాచ్ లు శుక్రవారం ఉదయం 07.30 గంటలకు మహిళలు; 11.30 గంటలకు పురుష జట్ల మధ్య ప్రారంభం అవుతాయి. అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు వెల్లింగ్టన్ వెస్ట్ పాక్ మైదానంలో నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఒకే తీరుగా ఆడి, ప్రత్యర్థుల చేతిలో ఘోర పరాజయం పాలయ్యాయి.

రోహిత్ శర్మ నేతృత్వంలో భారత పురుషుల జట్టు ఛేజింగ్ లో చతికిలపడి, ఏకంగా 80 పరుగుల తేడాతో న్యూజిలాండ్ కు మ్యాచ్ వదులుకుంది. పరుగుల తేడా పరంగా భారతజట్టుకు ఇదే పెద్ద పరాజయంగా మిగిలింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనట్టు ఏకంగా ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ తో బరిలోకి దిగినా భారీ తేడాతో బోర్లాపడింది. బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, ధవన్ , పాండ్యా సోదరులు కృనాల్, హార్దిక్ లతో పాటు ధోనీ, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వున్నా భారత్ ఘోర పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు. జట్టునంతా బ్యాట్స్ మెన్ తో నింపివేసిన రోహిత్ బౌలర్ల కూర్పును గాలికొదిలేసినట్టు ఎవరికైనా అన్పిస్తుంది.

న్యూజిలాండ్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా టీమిండియా 139 పరుగులకే చేతులెత్తేసిందంటే మన బౌలర్లు ఎంతగా తేలిపోయారో అవగతమౌతుంది. ఇలా భారత బౌలర్లు ముందుగా భారీగా పరుగులు సమర్పించుకుంటే , వారికంటే తాము తక్కువ తిన్నామా అన్నట్టు బ్యాట్స్ మెన్ క్రీజులోకి ఒకరివెంట ఒకరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే వేళ
కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడం జట్టును గట్టి దెబ్బ తీసింది. శిఖర్ ధవన్, రిషబ్ పంత్,ధోనీ, దినేష్ కార్తిక్ తో సహా ఏ ఒక్కరూ భారీ స్కోర్ చేయకపోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా న్యూజిలాండ్ వశమైంది. వన్డే సిరీస్ లోని నాలుగో వన్డేలో ఘోర పరాజయం పాలైనా ,టీమిండియా అయిదో వన్డేలో అదరగొట్టి సిరీస్ ను 4-1 తేడాతో కైవశం చేసుకుంది. అదే రీతిలో టి20 సిరీస్ లోనూ జూలు విదిల్చి, కివీస్ పనిపట్టాలని భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మాట కలవని మహిళా కెప్టెన్లు

భారత పురుషుల జట్టు విషయం అలా వుంటే , మహిళా జట్టు వన్డే, టి20 కెప్టెన్లు మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మధ్య వివాదాలతో కునారిల్లుతోంది. వెల్లింగ్టన్ లోనే పురుష జట్ల కంటే ముందుగా భారత- న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క వికెట్ నష్టానికి 100 పరుగులతో హడలెత్తించిన భారతజట్టు స్మృతి మందాన, రోడ్రిగ్స్ భాగస్వామ్యం విడిపోయాక కుదేలైంది. ఆ తరువాత ఒక్కరంటే ఒక్క బ్యాటరైనా పట్టుమని పదిబంతులైనా ఆడలేక చేతులెత్తేశారు.

చివరి 9 వికెట్లను కేవలం 35 పరుగులకే కోల్పోయి, ఘోర పరాజయం మూట గట్టుకుంది. ఏ ఒక్కరైనా చివరిదాకా నిలిచివుంటే ఇంత దారుణ ఓటమిని తప్పించుకోగలిగే వారేమో. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తుదిజట్టులో వుండివుంటే గొప్పగా పరుగులు చేయకున్నా కొంతమేరకు అండగా నిలిచి వుండేదని సగటు అభిమాని భావిస్తున్నాడు. అయితే మిథాలీని తుది 11 మందిలోకి ఎంపిక కాకుండా ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అడ్డుకుందనే ఆరోపణలు ప్రచారంలో వున్నాయి. ఈ విషయంలో జట్టు మేనేజ్ మెంట్ తక్షణం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆక్లాండ్ లో రేపు ఉదయం 7.30 గంటలకే మహిళల మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Recommended For You