ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు..

6 గంటలు.. 42 ప్రశ్నలు.. మనీల్యాండరింగ్‌ కేసులో రాబర్ట్‌ వద్రాను.. ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్‌ సుదీర్ఘంగా విచారించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఆస్తులపై ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు వాద్రాకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా రూపంలో కాంగ్రెస్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. యూపీఏ హయాంలో రక్షణ తదితర ఒప్పందాల ద్వారా ఆయన లండన్‌తో పాటు అనేక చోట్ల భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మనీల్యాండరింగ్‌ వ్యవహారాలపై రాబర్ట్‌ వాద్రాను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 6 గంటల్లో 42 ప్రశ్నలు సంధించారు. విదేశాల్లో ఉన్న ఆస్తులపై ఆరా తీశారు.

Also Read : పిచ్చి పలురకాలు.. యువకుడు తన తల్లిదండ్రులను అరెస్టు చేయాలంటూ..

లండన్‌లో రాబర్ట్ వాద్రా పేరిట దాదాపు 9 స్థిరాస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. 12- బ్రయాన్ స్టోన్ స్క్వేర్ లో 17 కోట్ల విలువైన స్థిరాస్తి, 83 కోట్ల రూపాయల విలువైన మరో 2 ఇళ్లు, 6 ఫ్లాట్లు ఉన్నాయని సమాచారం. ఈ ఆస్తులు ఎలా సంపాదించారు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.? విదేశాల్లో పెట్టుబడులు పెట్డడానికి ఎవరు సాయం చేశారు.? తదితర కోణాల్లో వాద్రాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఏడుగురు ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. లండన్‌లోని ఆస్తులతో పాటు ఆయన తరపున వ్యవహారాలు చక్కపెట్టిన మనోజ్‌ అరోరా గురించి ఆరా తీసినట్టు సమాచారం.

మరోవైపు లండన్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని రాబర్ట్‌ వాద్రా చెప్పినట్టు సమాచారం. గతంలో తన వద్ద పనిచేసిన ఉద్యోగిగా గానే మనోజ్‌ అరోరా తెలుసని వెల్లడించాడని సమాచారం. అరోరా తన తరపున ఎలాంటి ఈమెయిల్స్‌ రాయలేదని వాద్రా చెప్పినట్టు తెలుస్తోంది.

ఆర్థిక అవకతవకల ఆరోపణలపై రాబర్ట్‌ వాద్రా దర్యాప్తు సంస్థల ముందు హాజరవడం ఇదే తొలిసారి. అంతకు ముందు వాద్రాను ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్‌ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు నేరుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టొయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ వాహనంలో ఎస్పీజీ భద్రత నడుమ వాద్రా దంపతులు మధ్య ఢిల్లీలోని జామ్‌నగర్‌ హౌస్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.

మరోవైపు మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఫిబ్రవరి 16వరకు అరెస్టు చేయవద్దని సూచించింది.

Also Read : అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు నేతలతో చంద్రబాబు భేటీ

Recommended For You