నటనలో సక్సెస్‌.. ప్రేమలో ఫెయిల్.. నటి జీవితం విషాదం..

ప్రేమ పేరుతో హత్యలకు కూడా వెనుకాడని ఉన్మాదులు కొందరుంటే.. ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారు మరికొందరు. ప్రేమంటే.. ప్రాణాలు తీస్తున్నారు.. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కారణం ఏదైనా ప్రేమ పేరుతో కొందరి నిండు నూరేళ్ల జీవితం మధ్యలోనే ముగుస్తోంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి, పవిత్రబంధం సీరియల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సొంతింట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణం తీసుకుందామె. ప్రేమ వ్యవహారంతోనే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు అంటున్నారు. నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్తున్నారు. మంగళవారం రాత్రి తాము ఇంట్లో లేని సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకుందని కన్నీరు మున్నీరుగా విలపించారు. అర్ధరాత్రి తాము ఇంటికొచ్చి ఎంత పిలిచినా డోర్‌ తీయకపోవడంతో.. తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించామన్నారు. అప్పటికే ఝాన్సీ ప్రాణాలు కోల్పోయింది.

Also Read : అతను చుట్టాలబ్బాయి అనుకున్నాం : ఝాన్సీ ఇంటి పనిమనిషి

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఝాన్సీ సెల్‌ఫోన్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీయగా.. సూర్య అలియాస్ నాని అనే యువకుడి పేరు తెరపైకి వచ్చింది. అతని వేధింపుల వల్లే తన కూతురు ప్రాణం తీసుకుందని ఝాన్సీ తల్లి ఆరోపణ.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఝాన్సీ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఉన్నట్లు సమచారం. తన ఆత్మహత్యకు కారణాలను అందులో చెప్పినట్టు తెలుస్తోంది. దానిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలికి చెందిన ఝాన్సీ.. టీవీ నటిగా ప్రతిభ చాటుకుంది. బ్యూటీ పార్లర్‌ కూడా ఉంది. అవకాశాలు వస్తున్నా.. సూర్యతో ప్రేమలో పడి.. కొంతకాలంగా నటనకు దూరం జరిగింది. ఆమె లవ్‌స్టోరీ ఈమధ్యే తెలిసిందని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటామని చెప్పారని కొందరు బంధువులు అంటున్నారు. ఈ విషయంలో తల్లితో ఝాన్సీ గొడవ పడినట్టు ఇంకొందరు గుర్తుచేస్తున్నారు. సూర్య అలియాస్‌ నాని తరుచూ ఫ్లాట్‌కు వచ్చేవాడని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుటుంబం చెప్తోంది. చుట్టాలబ్బాయి అనుకున్నామని పనిమనిషి మాట.

తన ప్రేమ, సూర్యని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందా? సూర్య మోసం చేశాడని తట్టుకోలేకపోయిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారణం ఏదైనా.. అందమైన జీవితం అర్ధాంతరంగా ముగిసింది. బుల్లితెర వర్ధమాన నటి, పవిత్ర బంధం సీరియల్ ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Also Read : మొన్న జానకి.. అంతకుముందు లక్ష్మి.. ఇప్పుడు మధులిక..

Recommended For You