మహిళా టీ20 సిరీస్ న్యూజిలాండ్ దే..

స్వదేశీ గడ్డపై న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు జూలు విదిల్చింది. భారత మహిళా జట్టుతో జరుగుతున్న 3 T20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి వుండగానే 2-0 తేడాతో కైవశం చేసుకుంది. నరాలు తెగే రీతిలో అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో మ్యాచ్ ను ఆఖరు బంతికి లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆతిథ్య జట్టు మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా ఒడిసిపట్టింది.

Also Read : టి20 ల్లో ఓడిన భారత జట్లు

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయినా ఒత్తిడిని అధిగమించిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆతిథ్య జట్టు విజయంలో బ్యాటర్ ఎస్.డబ్ల్యూ. బేట్స్ 62 పరుగులు(52 బంతుల్లో) కీలకపాత్ర పోషించింది. బేట్స్, కెప్టెన్ సత్తెర్త్ వెయిట్ 23 పరుగులు (20 బంతుల్లో) మూడో వికెట్ కు 7.5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు.

భారత బ్యాటర్ల తడ’బ్యాటు’ ..

వెల్లింగ్టన్ మ్యాచ్ మాదిరిగా ఈ మ్యాచ్ లోనూ భారత బ్యాటర్లు తడబాటుకులోనై తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. గత మ్యాచ్ లా ఆలౌట్ కాకుండా నిలువగలిగినా న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం వుంచడంలో మాత్రం విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్ లో ఇద్దరు తప్ప బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేక చతికిలపడ్డారు. మొదటి టి20 లోనూ ఎనిమిది మంది భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే చేతులెత్తేశారు. మొన్నటి మ్యాచ్ లో ఛేజింగ్ లో చతికిల పడితే, ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగినా లక్ష్య నిర్దేశనంలో నీరసపడిపోయారు. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన 36 పరుగులు (27 బంతులు); రోడ్రిగ్స్ 72 పరుగులు(53 బంతుల్లో) మినహా ఏ ఒక్కరూ ఆరు పరుగుల మార్కునైనా చేరలేక చేతులెత్తేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మరోసారి నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లోనూ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను తుది జట్టులోకి తీసుకోలేదు. రెండు వరుస పరాజయాలతో సిరీస్ ను ఇప్పటికే న్యూజిలాండ్ కు సమర్పించుకున్న కౌర్ చివరి మ్యాచ్ లోనైనా మిథాలీ రాజ్ కు ఆడే అవకాశం కల్పిస్తుందో లేదో చూడాలి. చివరి టి20 భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు హామిల్టన్ లోని సెద్ధాన్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది.

Recommended For You