కివీస్ తో T20 సిరీస్ సమం

india won 2nd t20 on newziland in Auckland

న్యూజిలాండ్ పై మొదటి టి20 మ్యాచ్ లో ఓటమికి టీమిండియా పురుషుల జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆక్లాండ్ లో జరిగిన రెండో మ్యాచ్ లో ఆతిథ్య జట్టుపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ ను సమం చేసింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలి వుండగానే విజయం సాధించింది. 159 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ మొదటి వికెట్ భాగస్వామ్యానికి 9.2 ఓవర్లలో 79 పరుగులు సాధించడం, టార్గెట్ మరీ పెద్దది కాకపోవడంతో భారత జట్టుకు ఛేదన సునాయాసమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులు(29 బంతులు); ధవన్ 30 పరుగులు(31 బంతులు) చేశారు. రిషబ్ పంత్ 40 పరుగులు(28 బంతులు), ధోనీ 20 పరుగులు(17 బంతులు) కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద T20 లలో అత్యధిక పరుగుల వీరుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్ (2272 పరుగులు) పేరిట ఇప్పటి దాకా వున్న ఈ రికార్డు ఇప్పుడు రోహిత్ పరమైంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ మొదటి టి20 కి భిన్నంగా నీరసంగా నడిచింది. గ్రాండ్ హోమ్ 50 పరుగులు(28 బంతులు),రాస్ టేలర్ 42 పరుగులు(36 బంతులు) మినహా ఏ బ్యాట్స్ మెన్ కూడా ధాటిగా ఆడలేకపోయారు. వెల్లింగ్టన్ టి20లో ధారాళంగా 219 పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు ఈసారి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు పిండుకోవడం న్యూజిలాండ్ బాట్స్ మెన్ కు సాధ్యం కాలేదు. అయిదో వికెట్ కు చేసిన 77 పరుగుల భాగస్వామ్యం మినహా ఏదశలోనూ కివీస్ బ్యాటింగ్ సజావుగా సాగలేదు. కృణాల్ పాండ్యా 28 పరుగులకు 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఇదే గ్రౌండ్లో ఈరోజు ఉదయం జరిగిన మరో టి20 మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఓటమిపాలై, కివీస్ కు సిరీస్ సమర్పించుకుంది. భారత-న్యూజిలాండ్ పురుషులు, మహిళల జట్ల మధ్య చివరి,మూడో టి20 మ్యాచ్ లు హామిల్టన్ సెడ్డామ్ పార్క్ స్టేడియంలో ఆదివారం జరుగుతాయి.