రికార్డుల రారాజు రోహిత్ శర్మ

-కన్నెగంటి

టి 20 ల్లో భారత తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డులతో దూసుకు పోతున్నాడు. కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీతో న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల T20 సిరీస్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెండో టి20 లో అర్థ సెంచరీ చేసిన రోహిత్ మొత్తం 2288 పరుగులతో టి 20 ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈమ్యాచ్ లో 35వ పరుగు చేయడంతోనే రోహిత్ టి20ల్లో పరుగుల వీరుడిగా న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్ 2272 అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టి, నెంబరు వన్ స్థానంలో నిలిచాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన రోహిత్ పేరిటే అత్యధిక టి20 సెంచరీల రికార్డు కూడా కొనసాగుతోంది. అన్నట్టు టి20 లలో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు కూడా రోహిత్ కోసం ఎదురు చూస్తోంది. గఫ్టిల్ , క్రిస్ గేల్ చెరో 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా… రోహిత్ 102 సిక్సర్లతో వారిని వెన్నంటి వున్నాడు.

Also read : నటి ఝాన్సీ సూసైడ్ : అది ప్రాక్టీస్ వీడియోనా?

ఈరోజు ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20లో రోహిత్ నాలుగు సిక్సర్లు బాది మరో కొత్త రికార్డుపై కన్నేశాడు. ఎల్లుండి హామిల్టన్ లో జరిగే మూడో, చివరి టి20 లో రెండు సిక్సర్లు కొట్టగలిగితే అత్యధిక సిక్సర్ల రికార్డు సైతం రోహిత్ పాదాక్రాంతం అవుతుంది. అయితే వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ కేవలం 52 ఇన్నింగ్స్ ల్లో, న్యూజిలాండ్ ఆటగాడు గఫ్టిల్ 74 ఇన్నింగ్స్ ల్లో 103 సిక్సర్లు సాధించారు.రోహిత్ 102 సిక్సర్లు కొట్టేందుకు 84 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.కాగా టి20లలో 223 బౌండరీలతో శ్రీలంక వెటరన్ దిల్షాన్ అగ్రస్థానంలో , 218 ఫోర్లతో విరాట్ కోహ్లి, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ షజ్జాద్ సంయుక్తంగా రెండో స్థానంలో రోహిత్ (204 బౌండరీలు) కంటె ముందున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో టి20 లకు దూరంగా వుండడం వల్లే రోహిత్ ఈ రికార్డులు సాధించాడనడం అంత అతిశయోక్తి కాదేమో! కోహ్లి కేవలం 60 ఇన్నింగ్స్ లలోనే 49.25 సగటుతో 2167 పరుగులతో గట్టి పోటీదారుగా వున్నాడు. రోహిత్ సగటు 32.68 తో పోలిస్తే కోహ్లీ అందనంత ఎత్తులో నిలిచాడనడం అతిశయోక్తి కాదు!

Recommended For You