ఆదమరిచి ఉండకండి.. వంట గ్యాస్‌తో జాగ్రత్తండి.. కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం..

ఎక్కడో బాంబు పేలి ప్రాణ నష్టం జరిగింది.. దాంతో పాటు ఆస్తి నష్టం కూడా చాలా జరిగిందని వార్తలు చదువుతుంటాము.. వింటూ వుంటాము. అది కావాలని కొందరు ముష్కరులు చేసే పని.. మరి మనం రోజూ వాడే ఇంట్లో గ్యాస్ సిలిండర్లు మన అజాగ్రత్త వలన పేలి పోతున్నాయి.

ఈ మధ్య మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇలాంటి వార్తలు. సబ్సిడీ రేటుకే సిలిండర్ వస్తుండడంతో పేద, మధ్య తరగతి వారు కూడా విరివిగా గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. అయితే సిలిండర్‌తో జాగ్రత్తగా ఉండే విషయంలో చాలా మంది పెద్ద సీరియస్‌గా తీసుకోరు.

నిజానికి ఇళ్లలో మనం వాడే వస్తువులన్నీ దాదాపుగా ఎలక్ట్రిక్ సంబంధిత వస్తువులే ఉంటాయి. వాటికీ, గ్యాస్‌కి కూడా లింకుంది. గ్యాస్ లీకేజీని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఎప్పుడైనా సిలిండర్ సరిగ్గా పెట్టడం వస్తేనే రెగ్యులేటర్‌ని సిలిండర్‌కి అటాచే చేయాలి. ఒకటికి రెండు సార్లు సరిగ్గా సెట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక వేళ పెట్టడం రాకపోతే సిలిండర్ సప్లై చేసే బాయ్ వచ్చినప్పుడే రెగ్యులేటర్ పెట్టడం నేర్చుకోండి. ఇంట్లో ఉన్న ఇద్దరికీ పెట్టడం వచ్చి వుంటే మంచిది. రానట్లయితే ప్రయోగాలు ఏ మాత్రం చేయొద్దు.

సిలిండర్‌కి, స్టౌకి వారధిగా వుండే ట్యూబ్‌ని ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమాత్రం గ్యాస్ లీకవుతున్నట్లు అనిపించినా వెంటనే ట్యూబ్ మార్చేయండి. బయటి షాపుల్లో దొరికే ట్యూబులకంటే గ్యాస్ కంపెనీలోనివి అయితే నాణ్యత విషయంలో ఢోకా వుండదు.
గ్యాస్ స్టౌ ఎప్పడూ సిలిండర్‌ కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఒక్కోసారి ఎక్కువ వంట చేయాల్సి వస్తుందని స్టౌని కింద పెట్టి వంట చేస్తుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. వీలైనంత వరకు స్టౌ. సిలిండర్ కంటే హైట్‌లోనే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి.

స్టౌని ఏమాత్రం కడిగే ప్రయత్నం చేయకండి. నీళ్లు స్టౌ కట్టే నాబ్‌లోకి వెళ్లి గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బట్ట తీసుకుని రోజూ శుభ్రంగా తుడవండి.
పాలు, సాంబార్ లాంటివి పొంగితే స్టౌ బర్నర్లోకి వెళ్లి రంద్రాలు బూడిపోతాయి. అప్పుడు వాటిని తీసి వెంటనే శుభ్రం చేయండి. ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు.

అన్నిటికంటే ముఖ్య విషయం స్టౌతో పనైపోయిన ప్రతిసారి బర్నర్ ఎలా అయితే ఆఫ్ చేస్తామో అలాగే సిలిండర్ కూడా ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన ప్రమాదాలని ఖచ్చితంగా నివారించగలుగుతాము.
చాలా మంది వంటగదిలోని స్టౌపేనే కిటికీ ఉండేలా చూసుకుంటారు. అయితే దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. గాలికి స్టౌ ఆరిపోతుంది. ఆ విషయం మీకు అర్థం కాదు. అందుకే ఒకవేళ కిటికీ ఉంటే దాన్ని మూసి వంట పూర్తి చేయండి. తరువాత ఓపెన్ చేయండి.

ఎప్పుడైనా గ్యాస్ ఆరిపోయి లీకవుతున్న వాసన వస్తే వెంటనే డోర్లన్నీ ఓపెన్ చేసి ఇంట్లోని అందరూ బయటకు వెళ్లిపోండి. అంతేగాని పొరపాటున కూడా లైట్లు ఆన్ కానీ ఆఫ్ కానీ చేయొద్దు.
వంట గదిలో ప్రిడ్జ్ పెట్టకపోవడమే మంచిది. ఇక పూజ రూము కూడా కిచెన్‌లో ఉండకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే పూజ చేసినప్పుడు అగర్ బత్తీలు వెలిగిస్తుంటాము. దీపారాధన చేస్తుంటాము. ఇవన్నీ అగ్నికి సంబంధించినవి. గ్యాస్ లీకయితే చాలా ప్రమాదం జరుగుతుంది.

మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచే అమలు పరిస్తే మీరు, మీతోపాటు మీ చుట్టు పక్కల వారు హ్యాపీగా ఉండొచ్చు.

Recommended For You