సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..

తమ కలను సాకారం చేసుకోవడానికి సివిల్స్ విద్యార్థులు రోజులో 20 గంటలు చదువుకే కేటాయిస్తుంటారు. అన్ని అంశాలపై పట్టు సాధించడానికి రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని మూడు స్టేజ్‌ల్లో ముగిసే ఈ కార్యక్రమంలో ఏ ఒక్క స్టేజ్‌ని మిస్సయినా మళ్లీ మొదటికే రావలసి ఉంటుంది.

లాస్ట్ స్టేజ్ అయిన ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగిన వారుంటారు. అయినా వారిలో ఉత్సాహం నీరు కారదు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంటారు. అత్యున్నత స్థాయిని చేరుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఎంతో కష్టమైన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను, మెయిన్స్ పరీక్షను దాటుకుని ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే వారి ప్రతిభ సామాన్యమైనది కాదు.

ఇకపై ఇంటర్వ్యూ వరకు వచ్చిన విద్యార్థులు అక్కడ విజయం సాధించలేకపోతే వారిని తక్కువ అంచనా వేయకుండా వారికి తగ్గ ఉద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఓ ప్రతిపాదనను యూపీఎస్సీ తాజాగా చేసింది. దీన్ని కనుక కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే వేలాది మంది సివిల్స్ విద్యార్థులకు ఎంతో కొంత ఊరట లభించినట్లవుతుంది.

భువనేశ్వర్‌లో జరిగిన వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా ఈ ప్రతిపాదన గురించి వివరించారు. ఏటా కొన్ని లక్షల మంది సివిల్స్‌కి పోటీ పడుతుంటారు. అయితే ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ వరకు వచ్చే వారి సంఖ్య 40 శాతానికి తగ్గిపోతోంది.

ఇక మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వచ్చే సరికి ఆ సంఖ్య కాస్తా 10 నుంచి 20 శాతానికి పడిపోతుంది. 2018లో 8లక్షలమంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాయగా వారిలో కేవలం 10,500 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కి అర్హత సాధించారు. వీరి నుంచి 2 వేల మంది ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు.

అందులో 1200 మంది ఇంటర్వ్యూ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే ఆ అభ్యర్థిని సమర్ధుడిగానే పరిగణిస్తారు. ప్రతిభ ఉన్న ఇలాంటి వారందరినీ ఎందుకు వదిలేయడం. దేశానికి ఇలాంటి వారు కావాలి. వీరి సేవల్ని వినియోగించుకోవాలని అని యూపీఎస్సీ నిర్ణయించి కేంద్రానికి సిఫారసు చేసినట్లు అరవింద్ తెలిపారు.

ఇకపోతే యూపీఎస్సీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకోదలచింది. అది మెయిన్స్ రాసిన వారందరి స్కోర్లు ఆన్‌లైన్‌లో పెట్టడం. వివిధ ప్రైవేటు సంస్థలకు కూడా ఈ డేటా అనుకూలంగా ఉంటుందని, ఆన్‌లైన్‌లో వారి స్కోరు చూసి కంపెనీలు పిలిచి ఆయా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాయని మరో అధికారి అన్నారు.

ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ పబ్లిక్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఐసీ) లో వివరాలన్నీ అభ్యర్థుల కోరిక మేరకు నమోదు చేస్తే వివిధ ఉపాధి కల్పన సంస్థలు తమకు నచ్చిన వారిని ఉద్యోగాల్లో తీసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.

Recommended For You