ఊరిస్తున్న రికార్డులు

india vs newziland t20

-కన్నెగంటి

న్యూజిలాండ్ గడ్డపై మొట్టమొదటి సిరీస్ విజయం…. వరుసగా 11 టి20 సిరీస్ లలో అపజయం ఎరుగని జట్టుగా రికార్డు …సారథ్యం వహించిన మొదటి15 టి20 లలో 13 మ్యాచ్ లు గెలిపించిన అరుదైన రికార్డు…మరో రెండు సిక్స్ లు కొడితే అత్యధిక సిక్సర్ల వీరుడిగా కిరీటం…ముచ్చటగా 20వ ద్వైపాక్షిక సిరీస్ విజయం…. న్యూజిలాండ్ పర్యటనలో ఆదివారం జరగనున్న చివరి,మూడో T20 మ్యాచ్ సాక్షిగా టీమిండియా, రోహిత్ శర్మలను తెగ ఊరిస్తున్న రికార్డుల జాబితా ఇది. అవును…ఒక్క విజయం..ఒకే ఒక్క విజయం…ఒక్క దెబ్బకు ఇన్ని రికార్డులను కైవశం చేసుకునేందుకు రోహిత్ శర్మ, టీమిండియాలకు సువర్ణావకాశం కల్పిస్తోంది. మరి ఇన్నేసి రికార్డులను పాదాక్రాంతం చేసే విజయాన్ని రోహిత్ సేన ఒడిసి పడుతుందా? వదిలి వేస్తుందా?హామిల్టన్ సెద్ధామ్ పార్క్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనున్న మూడో మ్యాచ్ ఫలితంపైనే ఈ రికార్డులన్నీ ఆధారపడి వున్నాయి.


ఆక్లాండ్ గెలుపుతో భారత్ బోణీ


న్యూజిలాండ్ లో ఆ దేశంపై ఇప్పటి దాకా నాలుగు టి20లు ఆడిన భారతజట్టు మూడింట ఓడిపోయింది. ఆక్లాండ్ టి20 విజయంతోనే అక్కడ భారత్ బోణీ కొట్టింది. ఆ విజయంతో 3 T20ల సిరీస్ ను 1-1 తో సమం చేసి, సమ ఉజ్జీగా నిలిచింది. దీనితో సిరీస్ ను గెలుచుకునే అవకాశంతో పాటు వరుసగా 10 టి20 సిరీస్ లలో అపజయం ఎరుగని జట్టుగా రికార్డును నిలుపుకుంది. ఆదివారం నాటి మ్యాచ్ లో విజయం సాధిస్తే మ్యాచ్,సిరీస్ టీమిండియా పరమౌతాయి. న్యూజిలాండ్ లో తొలి సిరీస్ విజయంగానే కాకుండా, 11 వరుస సిరీస్ విజయాలతో టి20 కింగ్ హోదాలో వున్న దాయాది పాకిస్థాన్ సరసన సగర్వంగా నిలిచే అవకాశం కలుగుతుంది.


రో’హిట్’ అవుతాడా?


ఇక తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మకు స్వాగతం పలికేందుకు పలు రికార్డులు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టి20 లలో అత్యధిక పరుగుల వీరుడి రికార్డు నిన్ననే రోహిత్ ను వరించింది. రేపటి మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొడితే 104 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు సంధించిన మరో రికార్డూ రోహిత్ కు దాసోహం అనేందుకు ఎదురు చూస్తోంది. అలాగే రేపటి మ్యాచ్ ను టీమిండియా గెలిస్తే న్యూజిలాండ్ లో భారత్ కు మొట్టమొదటి సిరీస్ విజయం అందించిన ఘనత రోహిత్ ఖాతాలో పడుతుంది. జట్టుకు సారథ్యం వహించిన మొదటి 15 మ్యాచ్ లలో 13 విజయాలు సాధించిపెట్టిన మరో అరుదైన రికార్డు రోహిత్ ను వరిస్తుంది. ఇలా అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు, అత్యధిక తొలి విజయాలు, అత్యధిక వరుస సిరీస్ విజయాల రికార్డులు రారా… రమ్మని రోహిత్, టీమిండియా లను ఆహ్వానిస్తున్నాయి. వెల్లింగ్టన్ లో వెళవెళబోయి… ఆక్లాండ్ లో అదరగొట్టి…ఏరోజు ఎలా ఆడతారో తెలియని రోహిత్ సేన ఆటతీరు హామిల్టన్ లో ఎలా వుండబోతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే నిన్నటిలాగే రోహిత్ శర్మతో పాటే జట్టంతా సమష్టిగా రాణించి, ఆఖరి వన్డేతో పాటు అరుదైన రికార్డులను సొంతం చేసుకోవాలని సగటు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.. కమాన్ రోహిత్… కమాన్ ఇండియా.

Recommended For You