పివి సింధుకు భారీ జాక్‌పాట్

-నరేష్

హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు భారీ జాక్‌పాట్ కొట్టింది. చైసీస్ టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ లీనింగ్‌ ఈ తెలుగుతేజంతో రూ. 50 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదే భారీ ఒప్పందం. దీంతో వార్షిక ఆదాయంలో సింధు టీమిండియా కెప్టెన్ కోహ్లీకి చేరువైంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ అంటే దశాబ్దాల పాటు చైనానే… తర్వాత జపాన్, కొరియా , మలేషియా వంటి దేశాలు మెరిసాయి. అయితే చాలా ఏళ్ళుగా ఆధిపత్యం కనబరిచిన చైనాకు చెక్ పెట్టింది మాత్రం భారత్ క్రీడాకారులే. కేవలం ఆటలోనే కాదు స్పాన్సర్‌షిప్‌లోనూ చైనా క్రీడాకారులను మనవాళ్ళు దాటేస్తున్నారు. ఒకప్పుడు తమ దేశపు షట్లర్లకు తప్ప మరో ఆటగాడిని పట్టించుకోని చైనా టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ లీనింగ్ ఇప్పుడు భారత స్టార్ ప్లేయర్స్‌తో ఒప్పందాల కోసం క్యూ కట్టింది. తాజాగా తెలుగుతేజం పివి సింధుతో లీనింగ్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పాన్సర్‌షిప్‌ విలువ 50 కోట్ల రూపాయలు. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద డీల్‌. నాలుగేళ్ళ పాటు కొనసాగనున్న ఒప్పందంలో రూ. 40 కోట్లు స్పాన్సర్‌షిప్‌గానూ, రూ.10 కోట్లు స్పోర్టింగ్ ఎక్విప్‌మెంట్‌ ఇవ్వనుంది. 2014-15 సీజన్‌లో సింధుతో 1.25 కోట్లకు డీల్ చేసుకున్న లీనింగ్‌… ఇప్పుడు దానికి 10 రెట్లు విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా తాజా ఒప్పందంతో వార్షిక ఆదాయంలో సింధు భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీకి చేరువైంది.

Also Read : సెల్ఫీలు దిగుతున్నారా?.. ఒక్క క్షణం..

ఇటీవలే మరో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌తో లీనింగ్ 35 కోట్ల విలువైన ఒప్పందం చేసుకోగా.. పారుపల్లి కష్యప్‌తో 8 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. అలాగే డబుల్స్ ప్లేయర్స్‌ మను అత్రి, సుమీత్‌రెడ్డీలతోనూ రెండేళ్ళకు 4 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా కంటే అత్యుత్తమ ప్రదర్శన మన క్రీడాకారులదే. దీంతో భారత షట్లర్లతో ఒప్పందాలు చేసుకునేందుకు లీనింగ్ ఆసక్తి చూపిస్తోంది.తమ సొంత దేశపు ప్లేయర్ల కంటే వరల్డ్‌వైడ్‌గా మన తెలుగుతేజాలకే క్రేజ్ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇదే జోరు కొనసాగితే రానున్న రోజుల్లో బ్రాండ్ వాల్యూకు సంబంధించి మన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Recommended For You