పెళ్లి వేడుకలో చిందులు.. పెళ్లి కొడుకు డ్రైనేజీలో..

పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. మందు, చిందులో మైమరచిపోయి డ్యాన్సులు వేశారు. కొద్ది సేపటికే వారి ఆనందం కాస్తా ఆవిరి అయింది. అందరూ డ్రైనేజీలో పడ్డారు. అందులో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు.

నోయిడాలోని హోషియార్‌పూర్‌‌కి చెందిన ఓ కుటుంబం.. కొడుకు పెళ్లి కోసమని ఫంక్షన్ హాల్‌ని బుక్ చేసింది. హాల్‌కి రోడ్డుకి మధ్యలో ఓ కాలువ వుండడంతో ఫంక్షన్ హాల్ యజమాని అప్పటికప్పుడు కాలువ మీద నాలుగు చెక్కలు వేసి బ్రిడ్జిలాగ ఏర్పాడు చేశాడు.

అప్పటికే పెళ్లి మంటపానికి చేరుకున్న వధువు తరపు బంధువులు పెళ్లి కొడుకుకోసం వేచి ఉన్నారు. బాజాభజంత్రీలతో పెళ్లి కొడుకుని తీసుకువస్తున్నారు. ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ పెళ్లి మంటపానికి వస్తున్నారు. మధ్యలో కాలువ వుందని దానిపైన చెక్కలు అమర్చారన్న విషయాన్ని మరిచి పోయి మరీ డ్యాన్సులు చేస్తున్నారు.

ఒక్కసారే చాలా మంది ఎక్కేసరికి అది కాస్తా విరిగి దానిపైన డ్యాన్సులు చేస్తున్నవారంతా కాలువ డ్రైనేజీలో పడిపోయారు. అందులో పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్న పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే ఇదెక్కడి గొడవరా అనుకుని మిగిలిన వారంతా కాలువలో పడిపోయిన వాళ్లని పైకి తీసారు.

పెళ్లి కొడుకు పెట్టుకున్న నగలు అన్నీ కాల్వలో పడిపోయాయి. కాల్వలో పడిన 15 మంది నిక్షేపంగా బయటకు వచ్చారు. ప్రాణనష్టం జరగకపోవడంతో పెళ్లి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ యజమానితో గొడవకు దిగి హాల్ బుకింగ్‌ కోసం కట్టిన రూ.3 లక్షలు ఇచ్చేయమన్నారు.

అందుకు యజమాని అంగీకరించడంతో పెళ్లి ఏర్పట్లు ప్రారంభించారు కుటుంబసభ్యులు. పెళ్లి కొడుక్కి శుభ్రంగా స్నానం చేయించి తీసుకువచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. ముహూర్తానికి ముందు ఆటంకం ఎదురైనా సమయానికే పెళ్లి కుమార్తె మెడలో మూడు ముళ్లూ వేశాడు పెళ్లి కొడుకు.

Recommended For You