టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

చంద్రబాబు ధర్మపోరాటంతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ సీఎం చేపట్టిన దీక్షకు పలు జాతీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీ అగ్రనేతలంతా దీక్షా వేదిక వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా తరలివచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్‌ సహా పలువురు సీనియర్లంతా విడతలవారీగా దీక్షలో పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ప్రధాని మోడీ అని మండిపడ్డారు.

ఏపీకి హోదా డిమాండ్‌కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం- NC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా TDP సర్కార్‌ ఉద్యమానికి మద్దతిచ్చారు. తమిళనాడు నుంచి డీఎంకే, పశ్చిమబెంగాల్ నుంచి టీఎంసీ ప్రతినిధులు కూడా చంద్రబాబు పోరాటం న్యాయబద్ధమైందన్నారు. తామంతా ఏపీ సర్కార్ వెంట ఉంటామన్నారు. జాతీయ కూటమిలో ఉన్న 23 పార్టీలు చంద్రబాబు పోరాటానికి మద్దతివ్వడంతో.. TDP శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయిలో అందరి దృష్టికి తీసుకురావడంలోనూ విజయం సాధించామంటున్నారు.

ఏపీ భవన్ వేదికగా జరుగుతున్న దీక్షలో చంద్రబాబుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ముఖ్యనేతలు పాల్గొన్నారు. 2 ప్రత్యేక రైళ్లలో హస్తినకు చేరుకుని దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల వరకూ నిరసన కొనసాగనుంది. రేపు రాష్ట్రపతిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్, రాజధాని నిధులు, విద్యాసంస్థల ఏర్పాటు ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రం నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరిస్తోందని టీడీపీ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు.

న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నరేంద్రమోడీ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నిలదీస్తే ఈడీ దాడులు చేయించారని.. అమరావతి వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగారన్నారు. 15వందల కోట్లు ఇచ్చి లెక్కలు అడుగుతున్న మోడీ.. మేం చెల్లించిన పన్నులవాటకు లెక్కలు చెబుతారా అని ప్రశ్నించారు. ప్రజల మనోభవాలకు అనుగుణంగా పాలన చేయడంలో మోడీ విఫలమయ్యారని.. ఆయన్ను ఓడించడం కోసం పనిచేస్తామన్నారు. గతంలో తెలుగు ప్రజలు జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పిన సంగతులు మరిచిపోవద్దన్నారు చంద్రబాబు

Recommended For You