పర్స్ ఖాళీ అవుతోందా ..అయితే ఏం చేయాలి

ఆర్థిక నిపుణులు ఓ సూత్రాన్ని చెబుతుంటారు.. పెదవాడిగా పుట్టడం నీ చేతుల్లో లేదు. కానీ పేదవాడిగా మరణించడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది అని. నిజమేనేమో.. మనిషిగా పుట్టించి ఇన్ని తెలివితేటలు ఇచ్చాడు దేవుడు.

వాటిని సక్రమంగా వినియోగించుకుని మరొకరికి భారం కాకుండా బతకడంలోనే ఆనందం ఉంటుంది. అందుకోసం అనుక్షణం ఆలోచించాలి. ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. చేజారిన క్షణం మళ్లీ తిరిగి రాదు అని గుర్తుంచుకోవాలి. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి.

జీవితానికి భద్రతను భరోసాను కల్పించుకోవాలి. ఎవరికైనా వారి జీవన శైలే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందులో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రణాళికా బద్దంగా జీవితాన్ని గడపకపోతే ఆదాయం కన్నా ఖర్చులెక్కువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


ముందుగా ప్రతి నెలా ఓ ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అందులో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు మీ చేతుల్లోనే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మీద ఓ నియంత్రణ ఎంతైనా ముఖ్యం. నెలా నెలా జీతం వస్తుంది కదా పొదుపు ఎందుకు అని అనుకోవద్దు. భవిష్యత్ భద్రంగా ఉండాలంటే పొదుపు చేయడం అవసరం అని గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఎక్కువ జీతం వస్తున్నా పొదుపు మీద అవగాహన ఉండదు. ఇలా ఉంటే ఏదో ఒక రోజు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది. బిల్లులు సమయానికి చెల్లించండి. చివరి తేదీ వరకు వాయిదా వేయకండి. అనవసరంగా ఫైన్ కట్టే ఇబ్బంది ఉండదు సమయానికి చెల్లించేస్తే. మార్కెట్‌పై అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మొహమాటానికి పెట్టుబడి పెట్టేస్తే దానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. పెట్టుబడులపై ఓ అవగాహన అంటే లాభనష్టాలను బేరీజు వేసుకుని పెట్టుబడులు పెడితే భవిష్యత్ బాగుంటుంది.

ఈఎమ్‌ఐలు కట్టుకోవచ్చని అనవసమైన విలాస వస్తువుల జోలికి పోకపోవడమే మంచిది. తీసుకునే ముందు అది నిజంగా మనకి అవసరమా కాదా అని ఒక అంచనాకు వచ్చిన తరువాత ముందడుగు వేయండి.


కొన్నింటిని వాయిదా వేయకపోవడం మంచిది. ఉండడానికి ఇల్లు చాలా అవసరం. ఉద్యోగంలో నిలదొక్కుకున్నాక ఏదో విధంగా ముందు ఇంటిని సమకూర్చుకోవాలి.
ఖరీదైన జీవనశైలిని అలవర్చుకోకపోవడం మంచిది. ఏదో ఒక కారణంతో రెస్టారెంట్‌కు వెళితే బోలెడు ఖర్చు. ఎంజాయ్ మెంట్ అవసరమే కానీ పరిమితిలో ఉంటే మంచిది. నమ్మకం ఉన్న వాటిలో నష్ట భయం తక్కువ వున్న వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. బీమా విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. సంపాదన మొదలు పెట్టిన కొద్ది రోజులకే బీమా తీసుకోవడం తప్పని సరి.
ఎదైనా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు సహాయం కోసం ఎదురు చూడకుండా ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోండి.

Recommended For You