కరెంటు షాక్.. అనంత వాయువుల్లో కలిసిన చిన్నారి ప్రాణం

హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ దగ్గరున్న పెబెల్‌ సిటిలో నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలయ్యాడు. విద్యుత్‌ షాక్‌తో నిన్న(సోమవారం ) ప్రాణాలు కోల్పోయాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. బంతి పడడంతో కరెంట్ స్తంభం దగ్గరకు వెళ్లాడు. బంతిని తీసుకునే క్రమంలో విద్యుత్‌ స్తంభానికి టచ్ అయ్యాడు. అంతే కరెంట్ షాక్ తగిలింది. క్షణాల్లో ఆ చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ బాలుడు చనిపోయాడనే విషయం ఆక్షణంలో అక్కడున్నవారు సైతం గమనించలేకపోయారు. వితిన్ సెకండ్స్‌లో చనిపోయాడు.

Also read : ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భనవ్‌ వరకు ర్యాలీ చేపట్టిన సీఎం చంద్రబాబు

కరెంట్ స్తంభం ఏ మూలనో లేదు. పెద్దలు తిరిగేచోట, పిల్లలు ఆడుకునేచోటే ఉంది. దాన్ని ముట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సేఫ్టీ మెస్‌ కూడా లేదు. పిల్లలు ఆడుకుంటూ ఉండగా బంతి కరెంట్ పోల్స్‌ దగ్గర పడింది. అయితే.. నిన్న చిన్నారి పట్టుకున్న స్తంభానికి కరెంట్ సప్లై అయింది. దాని కింద భాగంలో గుంత ఏర్పడి.. అక్కడ ఐరన్ ప్లేట్‌కు కరెంట్ సరఫరా అవుతున్నట్టు తర్వాత గుర్తించారు. పాపం ఆ పిల్లాడికి ఇవేమీ తెలీవు. ఎప్పట్లాగే ఆడుకుంటూ బంతిని తెచ్చుకునేందుకు దాని చెంతకు వెళ్లాడు. ముట్టుకోగానే ప్రాణాలు కోల్పోయాడు.

కళ్లముందు ఆడుకుంటూ, సరదాగా తిరుగుతున్న చిన్నారి నిశ్చేష్టుడై కనిపించేసరికి అతని తల్లి తల్లడిల్లిపోయింది. ఇతరుల సాయంతో బాలుడ్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వాళ్లు కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లండని రిఫర్‌ చేశారు. రేతిబౌలిలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లగా.. అప్పటికే చిన్నారి చనిపోయాడని నిర్ధారించారు. ఆ టైంలో చిన్నారి తండ్రి చెన్నైలో ఉన్నాడు. వాళ్లది తమిళనాడుకు చెందిన కుటుంబమే. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చారు. పీస్‌ఫుల్‌గా ఉంటుందని పెబెల్ సిటీలో ఉంటున్నారు. చిన్నారి చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

హైదరాబాద్‌ శివార్లలో చేవెళ్ల మార్గంలో పెబెల్ సిటీ ఉంది. అక్కడ ఫ్లాట్ కొనాలంటే మినిమం అరకోటి పెట్టాలి. కార్పొరేట్ పీపుల్ నివశించే ఇక్కడ.. మెయింటెనెన్స్ విషయంలో యాజమాన్యం సీరియస్‌గా లేదనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం కరెంట్ షాక్‌కు ఓ చిన్నారి బలైపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. కొనడానికి అరకోటి పెట్టే ఫ్లాట్ ఓనర్లు.. ప్రతి నెలా మెయింటెనెన్స్‌కు భారీగానే చెల్లిస్తుంటారు. అయినా.. సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకుండా పోయింది. తోటి పిల్లలతో కలిసి హుషారుగా ఆడుకుంటున్న చిన్నారి.. కరెంట్ షాక్‌కు గురై ప్రాణఆలు కోల్పోవడం ఫ్లాట్ ఓనర్స్‌ను తీవ్రంగా కలిచివేస్తోంది.

మెయింటెనెన్స్‌ డబ్బులు చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైనా.. పెబెల్ సిటీ యాజమాన్యం ఒప్పుకోదు. ఫ్లాట్ ఓనర్లకు, వాళ్ల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిదే. ప్రైవేట్ సంస్థకు, కాంట్రాక్టు ఇచ్చేశాం అంటే ఎలా కుదురుతుంది? అదే సమయంలో ఫ్లాట్ ఓనర్లు సైతం ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సొంత గూడు సమకూర్చుకునేందుకు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్పితే.. ఇతర కీలక విషయాల్ని పట్టించుకోవడం లేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కరెంట్ షాక్‌తో చనిపోవడం ఏంటి? పెబెల్ సిటీ యాజమాన్యం, నిర్వహణ చూడాల్సిన కాంట్రాక్టు సంస్థలు ఎంత నిర్లక్ష్యానికి పాల్పడ్డాయి? దీనిపై పోలీసు కేసు నమోదైంది. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని IPC సెక్షన్ 304A ప్రకారం కేసు నమోదు చేశారు.

Recommended For You