ఓటరు కార్డులను ఆధార్‌తో జత చేయడం కుదరదు.. – సీఈసీ

ఏపీలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సునీల్ ఆరోరా సమీక్ష చేశారు. ఓటర్ల జాబితా మొదలు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితా తయారైనందున.. పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వేగంగా పరిశీలన జరుపుతున్నట్లు సీఈసీ చెప్పారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలోని కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించింది. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటేసేందుకు అవసరమైన చర్యలపై పార్టీలు., సన్నాహకాలపై ప్రభుత్వ శాఖలతో చర్చించారు. ఓటర్ల నమోదులో ఇబ్బందులు, సర్వేలతో ఓట్లు తొలగిస్తున్నారని కొన్ని పార్టీలు ఫిర్యాదు చేయగా.. ఎన్నికల దృష్టితో కొన్ని బదిలీలు జరిగాయనే ఆరోపణలు సీఈసీ దృష్టికి వెళ్లాయి. మహిళ ఓటర్లను ప్రలోభపెట్టేలా పోస్టు డేటెడ్ చెక్కులు ఇచ్చారని ఫిర్యాదులు కూడా అందాయని సీఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాన్‌డమ్‌ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నామినేషన్ల ఆఖరు వరకు ఓటర్ల జాబితా తనిఖీ చేస్తామని స్పష్టంచేశారు. కులాల ఆధారంగా పోలింగ్ బూత్‌ల ఏర్పాటు కుదరదన్నారు. ఐటీ విభాగానికి చెందిన ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో దర్యాప్తు విభాగం ఏర్పాటైందని వివరించారు. అధికారుల బదిలీలపై సీఎస్, డీజీపీ నుంచి ప్రమాణ పత్రాలు తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్త బదిలీలపై గడువు పెంచామన్నారు.

Also Read : ఆ ఒక్క ఎమ్మెల్సీ గురించే కాంగ్రెస్‌లో చర్చ..

పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై సీఈసీ దృష్టి సారించింది. ఏపీలోని 96 శాతం బడుల్లో విద్యుత్, మరుగుదొడ్లు ఉన్నాయని.. పెద్దగా సమస్యలు ఉండవన్నారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలకు బదులిచ్చిన అరోరా.. వాటి వినియోగంపై 77లోనే చర్చ మొదలైందని., వాటి హ్యాకింగ్‌పై 2010 నుంచి ఓ టెక్నికల్‌ కమిటీ పనిచేస్తోందని గుర్తుచేశారు. ఓటింగ్ యంత్రాలను ఫుట్ బాల్ మాదిరి ఆడటం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణలో ఓటర్లు ఒకచోటు నుంచి మరోచోటికీ వచ్చి ఓటు వేస్తున్నటు తమ దృష్టికి వచ్చిందన్న అరోరా.. దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు. డీజీపీపై లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదన్నారు. వస్తే పరిశీలిస్తామని చెప్పారు. RTGS సర్వేలపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని అరోరా చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో జత చేయడం కుదరదని అరోరా తేల్చేశారు. లీగల్ ఒపినీయన్ తర్వాతే ముందుకెళ్తామని స్పష్టంచేశారు.

Recommended For You