మోడీ, జగన్ కుమ్మక్కై రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

cm chandrababunidu teleconference

మోడీ, జగన్ కుమ్మక్కై రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటేనే గతంలో అంగీకరించామని.. కానీ బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. పార్టీ నేతలతో ఢిల్లీ నుంచి టెలికాన్ఫెరెన్స్ లో భాగంగా నేతలతో దీక్ష జరిగిన తీరుపై చర్చించారు. 11 రాష్ట్రాలకు హోదా ఉండదని చెప్పిన ఎన్డీయే ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూ ఏపీని మోసం చేశారన్నారు. ఏపీలో బీజేపీ చచ్చినపాముతో సమానమని.. ద్రోహం చేస్తున్న బురదపాము లాంటి వైసీపీ మోడీతో కలిసి చేస్తున్న కుట్రలను అడుగడుగునా ఎండగట్టాలని కేడర్ కు సూచించారు.

Also read : తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ సీట్ల కోసం దరఖాస్తులు.. సీట్లు ఆశిస్తున్న నేతలు వీరే

ఢిల్లీ దీక్ష ఫ్లాప్ షో అంటూ వైసీపీ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా 17 పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాల నాయకులు సైతం హాజరయ్యారు. అయినా విఫలమైందని చెప్పడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడమేనన్నారు. అన్ని రాష్ట్రాలు నాయకులు ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం సాధించిన నైతిక విజయమన్నారు. బీజేపీ, వైసీపీ మినహా మరేపార్టీ కూడా దీక్షను విమర్శించడం లేదన్నారు. ప్రధానికి గౌరవం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం ద్వారా వారి మధ్య బంధం మరోసారి బయటపెడిందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే టీడీపీ కార్యకర్తల లక్ష్యం కావాలని చంద్రబాబు సూచించారు. తద్వారా రాజకీయంగా ప్రజలు కూడా అండగా నిలుస్తారన్నారు. రాష్ట్రానికి హోదా ఇచ్చే ప్రభుత్వమే ఢిల్లీలో వస్తుందని చంద్రబాబు అన్నారు. విభజన హామీలు కూడా అమలవుతాయన్నారు. హోదా కోసం ఎవరూ బలిదానాలు చేయవద్దని.. ప్రభుత్వపరంగా పోరాటం చేస్తామన్నారు. అండగా ఉంటే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అర్జునరావు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని.. కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 20లక్షలు సాయం ప్రకటించామన్నారు.