టీమిండియా టార్గెట్ వన్డే ప్రపంచ కప్..

india-team
india-team
  • కన్నెగంటి

ఈ ఏడాది మే 30 వ తేదీ నుంచి ఇంగ్లండ్ లో జరగనున్న వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పై టీమిండియా గురి పెట్టింది. ప్రపంచ వన్డే ర్యాంకింగ్ లలో ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్న టీమిండియా ప్రపంచ కప్ టోర్నీలో నెంబర్ వన్ జట్టుగా అడుగు పెట్టాలని యత్నిస్తోంది. ఇంగ్లండ్ 126 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా, నాలుగు పాయింట్ల తేడాతో భారతజట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ లో ఈనెల 20న మొదలయ్యే 5 వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో ఆతిథ్య జట్టు గెలుచుకుంటే ఇంగ్లండ్ 121 పాయింట్లకు పడిపోతుంది. అలా కాకుండా ఇంగ్లండ్ టీం ఆ సిరీస్ లో నెగ్గితే మాత్రం ప్రపంచ కప్ లోగా ఇండియా నెంబర్ వన్ స్థానాన్ని చేరడం అసాధ్యం కాకున్నా కష్టమౌతుంది. ఆస్ట్రేలియాతో భారత్‌లో జరగనున్న వన్డే సిరీస్ ను 5-0 తేడాతో స్వీప్ చేయగలిగితేనే నెంబర్ వన్ ర్యాంక్ చేజిక్కుతుంది. అయితే ఎంత సొంత పిచ్ లైనా ఆస్ట్రేలియాను ఏకంగా క్లీన్ స్వీప్ చేయడం అంత తేలిక కాదు. పైగా ప్రపంచ కప్ ముందు టీమిండియాకు ఇదే చివరి ద్వైపాక్షిక సిరీస్ కావడంతో మరో ఛాన్స్ కూడా లేదు. అందుకే ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లలో ఇంగ్లండ్ కు దడ పుట్టిస్తున్న వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

గత కొన్ని మాసాలుగా చేస్తున్న విదేశీ పర్యటనలు, ఆడుతున్న మ్యాచ్ లనూ టీమిండియా అదే దృష్టితో ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో సిరీస్ లను కూడా ప్రపంచ కప్ షెడ్యూల్ కనుగుణంగానే రూపొందించారు. ఆ రెండు దేశాల వాతావరణం, పిచ్ లు ఇంగ్లండ్ పరిస్థితులకు దగ్గరగా వుంటాయనే యోచనతో ఈ రెండు దేశాల్లో భారత జట్టు పర్యటించింది. కాగా భారత్ లో రెండు టి20లు, 5 వన్డేలు మ్యాచ్ లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు వస్తోంది. ఈనెల 24వ తేదీన విశాఖ పట్టణంలో , 27వ తేదీన బెంగళూరులో ఇరు జట్లు రెండు టి 20 మ్యాచ్ లలో తలపడతాయి. హైదరాబాద్ లో మార్చి 2న మొదటి వన్డే జరుగుతుంది. 5న నాగపూర్, 8న రాంచి, 10న పంజాబ్ లోని మొహాలీ, 13న ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మిగిలిన నాలుగు వన్డేలు నిర్వహిస్తారు.

Also Read : నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమ జంట ఏకాంతంలో ఉండగా..

భారత జట్టుతో పాటు మిగిలిన అన్ని క్రికెట్ అగ్రదేశాలు సైతం వన్డే ప్రపంచ కప్ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారత- ఆస్ట్రేలియా సిరీస్ కు సమాంతరంగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్, ఇంగ్లండ్-వెస్టిండీస్, దక్షిణాఫ్రికా- శ్రీలంక, దక్షిణాఫ్రికా- పాకిస్థాన్, శ్రీలంక-ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్, స్కాట్లాండ్-నెదర్లాండ్స్ తదితర దేశాల మధ్య ఇదే సమయంలో పలు మ్యాచ్ లు జరుగుతున్నాయి. టీమిండియా లాగే అన్ని దేశాలు ప్రపంచ వన్డే కప్ టార్గెట్ గానే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రిజర్వు ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడం, సీనియర్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం అనే ద్విముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.

15 మందితో ప్రపంచ కప్ జట్టు:

ఇంగ్లండ్ లో మే -జులై మాసాల్లో జరగనున్న ప్రపంచ కప్ కు జట్టులో 15 మంది సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై బిసిసిఐ దృష్టి సారించింది. ఆస్ట్రేలియాతో ఈనెలలో ప్రారంభమయ్యే టి20 , మార్చిలో జరిగే 5 వన్డేల సిరీస్ లలో ఆయా ఆటగాళ్లు చూపే ప్రతిభ ప్రాతిపదికపైనే తుది జట్టును సెలక్షన్ కమిటి ఎంపిక చేయబోతోంది. ఈ సిరీస్ లకు ఆటగాళ్ల ఎంపికలోనూ రొటేషన్ విధానాన్ని కొనసాగించనున్నారు. న్యూజిలాండ్ టూర్లో చివరి రెండు వన్డేలు, టి20 మ్యాచ్ లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి విశ్రాంతి నిచ్చారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర ధవన్ లకు విశ్రాంతి నిచ్చి, శుబ్ మన్ గిల్, కె.ఎల్.రాహుల్, అజింక్యా రహానే లకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్లు విజయ్ శంకర్, కృనాల్ పాండ్యాలతో పాటు దినేష్ కార్తీక్, అంబటి రాయుడులకూ మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నారు. హార్దిక్ పాండ్యా ఇటీవల విపరీతంగా పరుగులు ఇవ్వడం, బ్యాటింగ్ లోనూ అంతగా రాణించకపోవడం టీం మేనేజ్ మెంట్ ను కలవర పరుస్తోంది. ఈనేపథ్యంలో ఆల్ రౌండర్ స్థానానికి పలువురు ఆటగాళ్లను పరీక్షిస్తోంది. వన్డే ప్రపంచ కప్ లో అగ్రశ్రేణి జట్లైన ఇంగ్లండ్, భారత్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి.