లక్కు లక్షల్లో కాదు కోట్లలో.. ఎప్పుడో రూ.970కు కొన్న రింగు ఇప్పుడు ..

ధనలక్ష్మి దారి మర్చి పోయి తన ఇంట్లోనే వుందని అస్సలు అనుకోలేదు. కాకపోతే ఏవిటి.. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం బావుందని కొని పడేసిన రూ.970పాయల ఉంగరం ఇప్పుడు కోట్లు పలుకుతుందని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి. కొన్నప్పుడు కొన్ని రోజులు పెట్టుకుంది.

తరువాత దాన్ని పెట్లో పెట్టి మర్చిపోయింది. అవీ ఇవీ సర్దుతుంటే పెట్టెలో ఓ మూల పడి ఉన్న రింగు లైటులా మెరిసింది. అదే ఆమె జీవితంలో వెలుగులు పంచింది. కష్టపడకుండానే కోటీశ్వరురాలైపోయింది.

లండన్‌కు చెందిన 55 ఏళ్ల డెబ్రా గడ్డర్డ్ 15 ఏళ్ల క్రితం రూ.970లు పెట్టి ఉంగరం కొనుక్కుంది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఆ రింగుని రోజూ పెట్టుకునేది. కొన్ని రోజులకి అది టైట్‌గా అనిపించి తీసి పెట్టెలో పెట్టింది. అయితే ఇటీవల తన తల్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని తెలిసి ఆదుకోవాలనుకుంది.

కానీ తన దగ్గర కూడా అంత డబ్బు లేదు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మి కొంత సర్థుబాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పెట్టెలో ఉన్న విలువైన వస్తువులతో పాటు ఓ మూలన పడి ఉన్న రింగుని కూడా తీసింది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రూ.970 లకు కొన్న రింగు అమ్మితే ఎంత వస్తుందో.

కనీసం కొన్న రేటైనా వస్తే బావుండు దేనికో దానికి వస్తాయి అనుకుంటూ షాపుకి వెళ్లింది.
షాపు యజమాని ఉంగరాన్ని మార్చి మార్చి చూసాడు. ఎక్కడ కొన్నారని ఆరా తీసాడు. ఇది 26.27 క్యారెట్ల వజ్రపు ఉంగరమని చెప్పడంతో డెబ్రాకి నోట మాట రాలేదు.

దాదాపు రూ. 7 కోట్ల విలువ చేస్తుందని చెప్పే సరికి ఆశ్చర్యపోయింది డెబ్రా. దాన్ని నేరుగా మరో పెద్ద నగల దుకాణానికి తీసుకెళ్లి చూపించింది. వారు కూడా అలానే చెప్పడంతో డెబ్రా ఉబ్బి తబ్బిబైంది. ఆ వజ్రపు ఉంగరాన్ని వేలానికి పెడితే ఖర్చులు పోనూ రూ.4.3 కోట్లు చేతికి వచ్చాయి.

చేతిలో లక్ష రూపాయలన్నా ఉంటే అమ్మ అప్పులు తీర్చేయాలనుకున్న డెబ్రాకి ఏకంగా కోట్లు వచ్చి పడ్డాయి. ఆ సొమ్ముతో అమ్మని ఆదుకుని తను కూడా ఓ సొంత ఇంటిని సమకూర్చుకుంటానంది. మిగిలిన సొమ్ముని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని తెలిపింది.

Recommended For You