జుట్టు ఊడిపోతోంది.. ఏం చెయ్యాలి.. ఇలా చేస్తే..

తల్లో దువ్వెన పెట్టాలంటే భయంగా ఉంది. మొత్తం ఊడి గుండయ్యేలా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎంతో పొడవుగా, ఒత్తుగా ఉన్న జడ కాస్తా ఇలా పిలకలా తయారైంది. కారణం కూడా మన చేసుకున్నదే అయినా ఇలా విచారిస్తుంటాం. అప్పుడు అమ్మ జడ వేస్తే ఇప్పుడు మనమే వేసుకుంటూ టైమైపోతుందని హడావిడిగా జుట్టు పీకినంత పని చేస్తుంటాం. ఇంకా తల స్నానం కోసం షాంపూ వాడకం. తడి తల మీదే బ్యాండ్ పెట్టేయడం. ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతుంటాయి. జూట్టుకి సరైన పోషణ అందక వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే వీలైనంత వరకు వెంట్రుకలు రాలడాన్ని నివారించవచ్చు. మరి అవేంటో చూద్దాం..
సాధారణంగా స్త్రీలలో అయినా, పురుషుల్లో అయినా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇది కొంత మందిలో వంశ పారంపర్యగా వచ్చే సమస్య. పెద్ద వారిలో బట్ట తల ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జుట్టు రాలే సమస్యను కొంత వరకు నివారించవచ్చు.
వారానికి ఒకసారి తలకు కొద్దిగా గోరు వెచ్చని ఆయిల్ జుట్టు కుదుళ్ల నుంచి పట్టించాలి.
విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వులనూనెను తలకు బాగా పట్టించి కాసేపు మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టు ఊడడం తగ్గుతుంది.


మందార పువ్వులను, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి కాచి ఆ నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి గంటసేపు ఉంచుకుని తలస్నానం చేయాలి.
మందార ఆకులను మెత్తగా నూరి, తలకు బాగా పట్టించాలి. ఇలా గంటసేపు ఉంచుకున్న తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఉసిరి రసం తీసి తలకి రాస్తే జుట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు పెరుగుతాయి.
నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పాలలో, ఒక స్పూను నిమ్మరసం కలిపి తలకు బాగా పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
పైన చెప్పిన చిట్కాల్లో మీకు తేలిగ్గా అనిపించినదాన్ని ఏదో ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తుంటే జుట్టు ఊడడాన్ని నివారించవచ్చు. దాంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరం.

Recommended For You