ఈసారి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారు..?

telangana cabinate updates

తెలంగాణ సర్కారు బడ్జెట్‌ కసరత్తు ప్రారంభించింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం… ఇచ్చిన హామీలు అమలు చేయడానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ.. సీఎం దగ్గరే ఉండడంతో ఆయన నేతృత్వంలోనే బడ్జెట్‌ తయారవుతోంది.

Also read : సంబంధాలు చూస్తున్నాం.. క్యాస్ట్ విషయంలో పట్టింపు లేదు.. నాగబాబు

ఈసారి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెడతారు..? ఆర్థిక మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయా అనే ఆసక్తి నెలకొంది. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. సుమారు రెండు లక్షల కోట్లకు బడ్జెట్‌ అంచనాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. మరో వైపు లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి బడ్జెట్‌ సమావేశాలు పూర్తి చేయాలని యోచిస్తున్న సర్కార్‌ ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు సిద్దమవుతోంది. కేంద్రం తరహలోనే తెలంగాణలోనూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని సర్కార్‌ భావిస్తోంది.

ఈ నెల మూడో వారంలో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలుండడంతో ఆదిశగా కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఆరు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూపొందిస్తున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ..గత బడ్జెట్‌ కంటే 15 శాతం ఎక్కువ ఉందబోతోందని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు సాయం పెంపునకు అదనపు నిధులు కేటాయించాల్సి ఉంది. అలాగే మరికొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశ పెట్టతారని సమాచారం. అందుకే గత బడ్జెట్‌ను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మించిపోనుందని తెలుస్తోంది.

మంత్రి వర్గ విస్తరణ లేకపోతే ఈసారికి సీఎం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌ను ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన అనవాయితీ గతంలోనూ ఉంది. శాసనసభలో ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. శాసన మండలిలో మహమూద్‌ అలీ ప్రవేశపెడతారని భావిస్తున్నారు. మరో ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విస్తరణ జరిగితే బడ్జెట్ ఎవరు ప్రవేశ పెడతారన్న దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.