కాపురానికి వెళ్లమన్నందుకు.. మహిళ చేసిన పని..

woman kills her Niece in vizag

కక్ష మనిషిని పశువుగా మారుస్తోంది. క్షణికావేశంలో అనుబంధాలనే మరిచిపోతున్నారు. కక్షలు, కార్పణ్యాలతో అభం శుభం తెలియని చిన్నారులను చంపడానికి వెనుకాడడం లేదు. మరదలి మీద కక్షను మేనకోడలిపై చూపించింది ఓ కంత్రీ లేడీ. భర్తతో కాపురానికి వెళ్లాలని మరదలు చెప్పినందుకు ఆగ్రహంతో… ఆమె కూతురినే కాటికి పంపించింది. చిన్నారి అని కూడా చూడకుండా.. మేనకోడలిని కత్తితో నరికి చంపింది ఓ కసాయి అత్త. విశాఖ జిల్లాలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది.

పెదబయలు మండలం లకేయిపుట్టులో ఆరేళ్ల బాలిక కొర్ర అనితను మేనత్త దారుణంగా హతమార్చింది. లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో తన భర్తతో గొడవ పడి తమ్ముడి ఇంటికి వచ్చింది. గత నెల రోజుల నుంచి తమ్ముడి ఇంట్లో ఉండటంతో.. భర్తతో కాపురానికి వెళ్ళమని మరదలు మందలించింది.

Also Read : కరెంటు షాక్.. అనంత వాయువుల్లో కలిసిన చిన్నారి ప్రాణం

ఈ నేపథ్యంలో రస్మో కోపంతో పాపను చంపుతానని బెదిరించింది. ఆవేశంతో వీధిలో ఆడుకుంటున్న మేనకోడలు అనితను కొండపైకి తీసుకెళ్లి కత్తితో నరికి చంపింది మేనత్త రస్మో. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితురాలిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంచికి వెళితే చెడు ఎదురైందని బిడ్డ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

Recommended For You