జ్యోతి మర్డర్‌ కేసులో సంచలన నిజాలు.. హత్య చేసింది ఆమె ప్రియుడే

re-postmortem-guntur-love-couple-murder-victim-jyoti

సంచలనం సృష్టిస్తోన్న జ్యోతి మర్డర్‌ కేసులో మిస్టరీ వీడింది. దర్యాప్తులో ప్రియుడు శ్రీనివాసే హంతకుడని తేలింది. ఇన్ని రోజులుగా జ్యోతి కుటుంబ సభ్యులు లేవనెత్తిన అనుమానాలే నిజమయ్యాయి. జ్యోతిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు ప్రియుడు శ్రీనివాస్‌. కేసును తప్పుదారి పట్టించేందుకే శ్రీనివాస్‌ గాయాలు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తేవడంతోనే చంపేశానని…హత్యకు మరో ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాని విచారణలో అంగీకరించాడు.

Also Read : నిన్న ఝాన్సీ.. నేడు యషిక.. సినీ ఇండస్ట్రీలో విషాదం

అంతే కాదు జ్యోతి హత్య కాకుండా మరికొన్ని సంచలన నిజాలు కూడా వెల్లడించాడు నిందితుడు శ్రీనివాస్‌. గతంలో నిర్మానుష్య ప్రదేశాల్లో అమ్మాయిలను తీసుకెళ్లి…వారి నగ్న చిత్రాలు తీసానని కూడా విచారణలో చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌ నేరచరిత్రపై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీనివాస్‌.

గుంటూరు జిల్లా నవులూరులో అమరావతి టౌన్‌షిప్‌లో ఈనెల 11వ తేదీ రాత్రి ప్రేమికులపై దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. జ్యోతి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోగా…ప్రియుడు శ్రీనివాస్‌ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇక అప్పటి నుంచి ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. నాలుగు రోజులుగా ఎలాంటి క్లూ దొరకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రేమ జంటపై దాడి చేసింది ఎవరు? వారిపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్నది పోలీసులకు అంతు చిక్కకుండా మారింది. చివరకు పోలీసుల దర్యాప్తుపై బంధువులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి శ్రీనివాసే ఈ హత్య చేసి ఉంటాడని జ్యోతి బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు ఆ కోణంలో తనదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత ప్రియుడే హంతకుడని తేల్చాడు.

జ్యోతిని అకారణంగా పొట్టనపెట్టుకున్న శ్రీనివాస్‌కు ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని అంటున్నారు. ఈ కేసులో మీడియా సహకారం ఎంతో ఉందన్నారు. ఇంటి స్థలం, 8 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు జ్యోతి కుటుంబ సభ్యులు.