కాశ్మీర్‌లో టెన్షన్‌.. ఆర్టికల్‌ 35 ఎ పై సుప్రీంకోర్టులో వాదనలు..

article-35a-hearing-supreme-court-jammu-kashmir

జమ్ము కాశ్మీర్‌లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు భద్రతా దళాల మోహరింపు, ముందస్తు అరెస్టులకు తోడు.. అక్కడక్కడా నిరసన జ్వాలలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్యాంగంలో జమ్ము కశ్మీర్‌కు విశేషాధికారాలు అందజేస్తున్న ఆర్టికల్‌ 35 ఎ పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఈ వాదనలపై అక్కడి ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే జమ్ములో హై అలర్ట్‌ ప్రకటించాయి భారత భద్రతా దళాలు..

కాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఈ అధికరణపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టు విచారణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. సుప్రీం విచారణతో పరిస్థితులు మరింత హద్దులు దాటకుండా వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది. కాశ్మీర్‌ కల్లోలానికి ఓ రకంగా ఈ ఆర్టికల్‌ కూడా కారణమని కొంతమంది వాదన. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జమ్ముకాశ్మీర్‌ భారత్‌లో విలీనమయ్యే సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు వీలుగా 370 ఆర్టికల్‌ను భారత ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపరిచింది. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్‌ రంగాలు తప్ప మిగతా రంగాలపై కేంద్రానికి అధికారం ఉండదు. పార్లమెంటు చట్టాలు చేసినా కశ్మీర్‌ అసెంబ్లీ వాటికి ఆమోదం తెలిపితేనే అవి అమల్లోకి వస్తాయి. జమ్ముకాశ్మీర్‌ భారత్‌లో చేరిన తరువాత ఇతరులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రజలు డిమాండ్‌ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రప్రభుత్వం 1954లో ఆర్టికల్‌ 35 ఎ ను రాజ్యాంగంలో చేర్చింది.

తొలి నుంచి ఆర్టికల్‌ వివాదస్పదంగానే మారింది. ఈ ఆర్టికల్‌ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వతపౌరులన్నది జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్‌కు అనుబంధాన్ని చేర్చే సమయంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. దీనికి భిన్నంగా మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పదవీకాలంలో రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి ఈ ఆర్టికల్‌పై వివాదం రగులుతూనే ఉంది. రాష్ట్ర పరిధిలో అంశాల్లో ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్‌ చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. అయితే పార్లమెంటు ఆమోదం లేకుండా ఆర్టికల్‌ను చేర్చడంపై కొన్నిఎన్జీవో సంఘాలులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి.

ఈ ఆర్టికల్‌ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వతపౌరులన్నది జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాల వారిని వివాహం చేసుకుంటే వారికి రాష్ట్రంలో ఆస్తిహక్కు ఉండదు. రాష్ట్రంలో శాశ్వత నివాస హక్కును వారి పిల్లలకు జారీచేయరు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఆర్టికల్‌ 35ఎ విరుద్ధంగా ఉండటంపై మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో 35ఏ ఆర్టికల్ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

మరోవైపు జమ్మూకాశ్మీర్ లో అసాధారణ స్థాయిలో భద్రత బలగాలు మోహరించాయి. రెండు రోజుల నుంచి జమ్ము లోయలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 10 వేల మంది పారా మిలటరీ బలగాలు మోహరించాయి. మరోవైపు దాదాపు 150 మంది వరకు వేర్పాటు వాదులను అరెస్ట్ చేయటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటు పుల్వామా ఘటన.. మరోవైపు ఆర్టికల్ 35A అంశంపై విచారణ నేపథ్యంలో భద్రత బలగాల మోహరింపు ఉత్కంఠ రేపుతోంది.