ప్రియాంకకు అన్నివేళలా సహకరిస్తానన్న వాద్రా.. తాజా ట్వీట్ చూస్తే..

Robert Vadra To Join Politics? His Facebook Post Gives A Hint

ప్రియాంక గాంధీ భర్తగా, సోనియా గాంధీ అల్లుడిగా యూపీఏ హయాం నుంచి బాగా ఫేమస్సయ్యారు రాబర్ట్ వాద్రా. ఆయనిప్పుడు ప్రియాంక మాదిరిగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాద్రా.. ఇటీవల తర భార్య ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆమెకు ప్రజాసేవలో అన్నివేళలా సహకరిస్తానని తెలిపారు. అయితే, ఆయన తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు మాత్రం.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందనే ప్రచారానికి ఊతమిస్తోంది.

తాజాగా తన ఫేస్‌బుక్ పేజ్‌లో రాబర్ట్ వాద్రా పెట్టిన పోస్ట్.. రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలను రేకెత్తిస్తోంది. భార్య ప్రియాంక మాదిరే, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయడంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్నానని ఆయన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని 2012లోనూ వాద్రా పేర్కొన్నారు.

అక్రమంగా ఆస్తుల కొనుగోలు, మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్‌ వాద్రా ఇప్పటికే పలుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అయితే రాబోయే రోజుల్లో ప్రియాంక తర్వాత వాద్రా కూడా రాజకీయాల్లో కీ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.