రోజూ ఓ రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే..

మసాలా దినుసుల్లో లవంగాలది ప్రముఖ పాత్ర. మాంసాహార వంటలకైతే కూరకి రుచితో పాటు మంచి సువాసనను అందిస్తుంది. ఇక తిన్న ఆహార పదార్థం సులభంగా జీర్ణం కావడానిక్కూడా మసాలా ఉపయోగపడుతుంది. కూరల్లోనే కాదు కాస్మొటిక్స్ తయారీల్లోనూ, వేసుకునే మందుల తయారీల్లోనూ, వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ లవంగాలను విరివిగా వాడుతుంటారు.

మనకంటే పక్కవారిని ఎక్కువగా ఇబ్బందికి గురి చేసే నోటి దుర్వాసను కూడా లవంగం దూరం చేస్తుంది. కొంతమందికి ప్రయాణం పడదు. కడుపులో తిప్పి వాంతి వస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు.
దగ్గు, జలుబు, తలనొప్పి వంటివి ఇబ్బంది పెడుతుంటే లవంగాన్ని బుగ్గన పెట్టుకోవాలి.

ఇలాంటి సమయంలో సమస్య తీవ్రతను బట్టి రోజుకి మూడు నాలుగు లవంగాలు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. బీపీని, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తుంది. లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పు, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాల్ని కూడా లవంగాలు అందిస్తాయి.

ముఖ్యంగా విటమిన్ సి, కె, ఫైబర్ (పీచు), మాంగనీస్, కాలరీలు, పిండిపదార్థాలను లవంగాలు అందిస్తాయి. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే దోహదం చేస్తుంది. అది లవంగాల్లో దొరుకుతుంది. లవంగాలు కేన్సర్ కణాలను వృద్ధి చెందనివ్వకుండా చూస్తాయని పరిశోధనల్లో తేలింది.

బరువు తగ్గించే విషయంలోనూ లవంగాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. లవంగాల్లో ఉన్న మాంగనీసు ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

ఏదైనా మంచిది కదా అని మోతాదుకు మించి తీసుకుంటే అవి కూడా చెడు చేస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడడం ఎంతైనా అవసరం.

Recommended For You