చూడ్డానికి సామాన్యురాలే.. కానీ ఆమె గురించి తెలిస్తే..

ఆమె.. ఆకాశంలో సగం. అనురాగంలో ఘనం. అన్ని బంధాలకు ఆదిమూలం. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆమె.. ఇప్పుడు నేల నుంచి నింగి వరకూ చేయలేని పనిలేదు. చేతకాని పనీ లేదు. కండబలంలో కాస్త తక్కువ అయినా.. బుద్ధిబలంలో మగవారికంటే ఎన్నో రెట్లు ఎక్కువని నిరూపించుకుంది.. అయినా ఆమెపై అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నది నిజం. ఇవాళ మహిళా దినోత్సవం. అంటే అమ్మల రోజు కూడా.

మహిళ.. ఈ మాటలోనే మహోన్నతం అనే మాట దాగుంది. మహిళ అంటే మానవతామూర్తి.. మహోన్నత భావాలున్న శక్తి.. ప్రపంచ గమనానికి మూలమైన కుటుంబ వ్యవస్థకు ఆది మూలం మహిళ. ఆమె అన్నిట్లో అత్యున్నతమే అయినా.. సమానత్వంలో అత్యల్పం. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం.

అనాది నుంచే మహిళపై అణచివేత ఉంది. మనిషిగా కాక వస్తువులా చూసిన చరిత్రా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళ తన శక్తిని పెంచుకున్నది. మగవారికి సమానంగా సత్తా చాటుతున్నది. అయినా ఆమెపై వివక్ష తగ్గలేదు. గౌరవం పెరగలేదు. మగవారికి సమానంగా కష్టపడినా సమాన వేతనం ఇవ్వలేదు. ఇదేమనే ప్రశ్నించే తత్వం నుంచి ఆమె శక్తి ఈ లోకానికి తెలియడం మొదలైంది.

18వ శతాబ్ధం చివర్లో పాశ్చాత్య దేశాల్లో సమాన హక్కుల కోసం మొదలైన నినాదం 19వ శతాబ్ధం ఆరంభానికి ఊపందుకుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన ఆహార కొరత, శాంతి కోసం సాగిన ఈ పోరాటంలో మహిళా శక్తి లోకానికి తెలిసింది. అయితే అప్పటి వరకూ వివిధ దేశాల్లో అనేక రోజుల్లో జరుపుకున్న మహిళా దినోత్సవం చివరగా 1914లో మార్చి 8న జరిగింది. అప్పటి నుంచీ ఈ రోజును ప్రపంచమంతా మహిళా దినోత్సవంగా జరుపుకుంటోంది.

నిజానికి ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా చెప్పాలి. శతాబ్ధం క్రితం పనిలో భాగస్వామ్యం, సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్స్ తో మొదలైన ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజును అంతర్జాతీయ శ్రామికమహిళా దినోత్సవంగానూ పిలుస్తారు.. ఆ రోజున మన అన్ని బంధాలకు మూలమైన మహిళను సమున్నతంగా గౌరవించడం మనం విధిగా ప్రమాణం చేసుకోవాల్సిన రోజు కూడా.

మహిళా దినోత్సవం కూడా మనకు దిగుమతి అయిన పండుగ లాంటిదే. కానీ ఇది అన్ని పండుగల్లా కాదు. స్త్రీ శక్తిని మళ్లీమళ్లీ మననం చేసుకునే అరుదైన అవకాశం. ఆమె శ్రమ శక్తిని గురించి లోకమంతా చెప్పుకునే సందర్భం. ఆ సందర్భాలను మనం తెలుగు సినిమాతో కలిపి పంచుకోవడం ఆనవాయితీగానూ వస్తోంది.

భారతదేశానికి మహిళా శక్తి అనే మాట కాస్త ఆలస్యంగా పరిచయం అయినా.. అందరికంటే వేగంగా దూసుకుపోయింది మన మహిళ. పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా.. తన శక్తిని చాటాల్సిన చోట ఎన్నడూ వెనకడుగు వేయలేదు.. అవసరమైతే పురాణాలను ఆదర్శంగా తీసుకుని నినదించింది మన మహిళ.

మనకూ మహిళా శక్తిని చాటిన సినిమాలు చాలా వచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమాలూ అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది కర్తవ్యం సినిమా గురించే. అయితే రియల్ లైఫ్ లోనూ పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్న అశ్వనీ నాచప్ప నటించిన సినిమాలూ ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.

ప్రాంతీయ ఉద్యమాల నుంచి ప్రపంచ రాజకీయాల వరకూ స్త్రీకి తెలియని విషయం ఏదీ లేదిప్పుడు. ఒకప్పుడులా పేరెంట్స్ ఏం చెబితే అది కాకుండా.. తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. తన ఆత్మవిశ్వాసానికి ఏ భంగం లేకుండా తన కాళ్లపై తాను నిలబడగలదు.. ఈ దిశగానూ మన సినిమా ఎదుగుతోంది..

మహిళా దినోత్సవం అంటే మనకు రక్తం పంచిన వారి రోజు. ఒక స్త్రీగా మన జీవితానికి అన్నీ అయ్యి.. జీవితాన్ని ఎన్నో విధాలుగా ముందుకు నడిపిస్తోన్న మహిళ సమాజం నుంచి కోరుకునేది ఏంటో తెలుసా..? వారి ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వని గౌరవం.. ఆత్మాభిమానాన్ని తగ్గించని నమ్మకం.. ఆ రెండూ మనం వారికి ఇవ్వాలి.. ఆకాశంలో కాదు.. ఈ నేలపైనా తనకు సగం ఇద్దాం.. అనునిత్యం ఆమెకు బాసటగా ఉంటామని బాస చేద్దాం..