ఇవాళ ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు.. ఎవరు ఎవరికీ మద్దతంటే..

today tollywood maa elections

టాలీవుడ్ లో మా అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. గత రెండేళ్లుగా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న శివాజీరాజాకు చెక్ పెట్టేందుకు నరేష్ పానెల్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్… అధ్యక్ష పదవి కోసం శివాజీరాజాతో పోటీకి సై అంటున్నారు. దీంతో ఇవాళ జరిగే మా అసోసియేషన్ ఎలక్షన్ వార్ ఆసక్తిని పెంచింది.

టాలీవుడ్ పాలిటిక్స్ కు కేరాఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. రెండు మూడు పర్యాయాలుగా సాధారణ ఎన్నికలను తలపించే రేంజ్ లో జరిగిన మా ఎన్నికలు ఈ సారి కూడా అదే టెంపో కొనసాగుతోంది. దీనికి నిదర్శనంగా ఇప్పటికే మా లో మాటల వేడి రాజుకుంది. అవినీతి ఆరోపణలతో మా జనరల్ సెక్రటరీ నరేష్…అధ్యక్షుడు శివాజీరాజాపై ఎటాక్ ప్రారంభించాడు.

మా నిధులను శివాజీ రాజా బృందం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు చేసిన నరేష్ ఇప్పుడు శివాజీ రాజా ప్యానల్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. శివాజీ రాజా పై నరేష్ చేసిన ఆరోపణలు మా విశ్వసనీయతను సవాల్ చేసాయి. స్టార్స్ తో విదేశాలలో షో లు నిర్వహించేందుకు కలెక్ట్ చేసిన ఫండ్స్ ని తమ లగ్జరీల కోసం మా లోని కొంతమంది సభ్యులు దుర్వినియోగం చేసారనే ఆరోపణలతో నరేష్ శివాజీ రాజా పై తిరుగుబాటు జండా ఎగురవేసాడు. నరేష్ ప్యానల్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు

అధ్యక్ష పదవికి శివాజీ రాజాపై నరేష్.. ఉపాధ్యక్ష పదవికి శ్రీకాంత్, రాజశేఖర్.. జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్, రఘుబాబు పోటీ పడుతున్నారు. నరేష్ కి జీవితా రాజశేఖర్ దంపతులు అండగా ఉన్నారు. శివాజీ రాజాకు శ్రీకాంత్ తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి , పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు సపోర్ట్ గా నిలిచారు. ‘మా’ లో కీలక బాధ్యతలు వహిస్తూ అద్యక్ష పదవికి ఎదిగిన శివాజీ రాజాకు ఉన్న ఇమేజ్ తక్కువేమీ కాదు. అందరినీ కలుపుకు పోవడం.. సినీయర్ కళాకారులకు పింఛన్లు పెంచడంలో ఆయన తీసుకున్న చొరవ అందిరీ మెప్పు పొందింది. నరేష్ చేసిన ఆరోపణలు కొట్టి పారేయడానికి లేదు. అయితే ఇవాళ జరగనున్న ‘మా’ ఎలెక్షన్స్ శివాజీరాజా నిజాయితీని నిరూపంచుకునే పరీక్షలా మారాయి. నరేష్ ప్యానల్ కూడా ‘మా’ గౌరవం పెంచేందుకు కృషి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. మరి ఈ మా సభ్యులు ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.