ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి..

12 die plane crash colombia

కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తరైరా, డోరిస్‌ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్‌ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.1930లో అమెరికాలో తయారైన డగ్లస్‌ డీసీ–3 విమానం శాన్‌ జోస్‌ డెల్‌ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని కొలంబియా విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

కాగా ప్రమాదానికి విమాన ఇంజిన్‌ వైఫల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. ప్రమాదానికి గల కారణాలు మాత్రం కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని కాంట్రాక్టు పద్దతిలో నిర్వహిస్తున్న లాజార్‌ ఏరియో కంపెనీ ప్రమాదంపై స్పందించడానికి నిరాకరించింది. విమాన ప్రమాద ఘటనపై అధ్యక్షుడు ఇవాన్‌ డుక్యూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.