అదరగొట్టిన అసీస్.. మళ్లీ బోల్తాపడ్డ భారత్

india vs australia 1st odi match

-కన్నెగంటి

అనుకున్నదొక్కటి…అయినదొక్కటి…అనే సామెత భారత క్రికెట్ జట్టు ఆటతీరుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందేమో. గెలుపు ముంగిట బోల్తా కొట్టడం భారతజట్టుకు అలవాటుగా మారినట్టు కన్పిస్తోంది. ప్రపంచ కప్ ముంగిట ఆడుతున్న చిట్టచివరి ద్వైపాక్షిక సిరీస్ లో భారతజట్టు ప్రదర్శన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ వైఫల్యాలతో…సమష్టితత్వం కరవై జట్టు అపజయాలను మూటగట్టుకోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.

Also Read : T20 సిరీస్ లో ఇంగ్లండ్ వుమెన్ క్లీన్ స్వీప్

మొన్న రాంఛీ,నిన్న మొహాలి వన్డేలలో కోహ్లీసేన వ్యూహాత్మక తప్పిదాలతో గెలవాల్సిన మ్యాచ్ లను ప్రత్యర్థికి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించిన తీరు వారిలో ఆగ్రహం తెప్పిస్తోంది.తాజా ఓటమితో అయిదు మ్యాచ్ ల వన్డే సిరీస్ 2-2 తో రసవత్తరంగా మారింది. ఫలితంగా ఆఖరి మ్యాచ్ మెగా టోర్నీ ఫైనల్స్ లా మారిపోయింది. భారతజట్టు సభ్యులు తమ బలహీనతలను అధిగమించలేకపోతే సొంతగడ్డపైనే సిరీస్ కోల్పోయి,ఘోర పరాభవం పాలయ్యే ప్రమాదం ఎదురుచూస్తోంది. ఆరేళ్ల తరువాత స్వదేశంలో రెండు వరుస వన్డేలలో భారతజట్టు అపజయం పాలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

వెంటాడుతున్న వైఫల్యాలు

మొదటి రెండు మ్యాచ్ లలో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా ఎలాగోలా విజయం సాధించిన కోహ్లీ సేన విజయాల మాటున తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంది. కానీ మూడు,నాలుగు వన్డేలలోనూ పరిస్థితులు ఏమాత్రం మెరుగు పడకపోవడంతో ఆ వైఫల్యాలు మరింతగా వెలుగు చూస్తున్నాయి.బౌలర్లు, ఫీల్డర్ల వైఫల్యాలకు కెప్టెన్ కోహ్లీ తప్పుడు నిర్ణయాలూ జట్టు పరాజయాలకు కారణమౌతున్నాయి.మొహాలీ వన్డేలో ఫీల్డింగ్ వైఫల్యాలు మరీ పరాకాష్టకు చేరాయి. వికెట్ కీపర్ రెండు స్టంపింగ్ ఛాన్స్ లు వదిలేస్తే, అదే ఓవర్ లో ఫీల్డర్లు రెండు క్యాచ్ లు జారవిడిచి జట్టు ఓటమికి కారకులయ్యారు.రాంఛీలో టార్గెట్ ఛేదించలేక, మొహాలీలో భారీ స్కోరును కాపాడుకోలేక కోహ్లీసేన అపజయం పాలైంది. ఈ రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచిన కోహ్లీ రెండు సందర్భాలలోనూ తప్పుడు నిర్ణయాలతో జట్టుకు ఎదురు దెబ్బతగిలింది. రెండుసార్లూ మంచు ప్రభావాన్ని అంచనా వేయడంలో కోహ్లీ వైఫల్యం భారతజట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.

ఒకే రకమైన పరిస్థితులు, వాతావరణంలో కోహ్లీ తీసుకున్న రెండు విభిన్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.రాంఛీలో ఫీల్డింగ్ చేయాలని, మొహాలీలో బ్యాటింగ్ కు దిగాలన్న తప్పుడు నిర్ణయాలతో కోహ్లీ ప్రత్యర్థికి గెలిచే అవకాశాలు కల్పించాడు.మంచు ప్రభావం గురించి రెండు మ్యాచ్ ల అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఈ వైఫల్యాలకు సాక్ష్యంగా నిలిచాయి. రాంఛీలో రాత్రి 7.30 తరువాత మంచుపడుతుందనే తప్పుడు సలహాతో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ…. అలాంటి పరిస్థితుల్లోనే మొహాలీలో బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడో అతడికే తెలియాలి. మంచు వల్ల బంతిపై పట్టు దొరకదని, ఛేదనలో బౌలింగ్ చేయడం కష్టసాధ్యమౌతుందని ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నామని రాంఛీలో చెప్పిన కోహ్లీ అదే లాజిక్ ను మొహాలీ వచ్చేసరికి ఎలా మరచిపోతాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

కోహ్లీ సేనకు అచ్చిరాని మొహాలీ

ఆదివారం జరిగిన మొహాలీ వన్డే భారత జట్టుకు పీడకలలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియాపై భారతజట్టు ఈ స్టేడియంలో ఆడిన నాలుగు వన్డేలలోనూ పరాజయం వెంటాడింది. ఏ జట్టు పైనైనా ఆస్ట్రేలియాకు ఇదే ఉత్తమ ఛేదన కాగా…భారత జట్టు కాపాడుకోలేకపోయిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. వరుస వైఫల్యాలతో కునారిల్లుతున్న ఓపెనర్ శిఖర్ ధవన్ కెరీర్ అత్యధిక స్కోరు(143) కూడా ఇదే.2017 తర్వాత స్వదేశంలో కోహ్లీ అత్యల్ప స్కోరూ(7 పరుగులు) ఈ మ్యాచ్ లోనే నమోదైంది. చివరి ఓవర్లలో బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అసమర్థత, అన్నింటికీ మించి కోహ్లీ అటు బ్యాట్స్ మ్యాన్ గా, ఇటు కెప్టెన్ గానూ తేలిపోవడంతో అసీస్ కు అద్భుత విజయం దక్కింది. నిజానికి ఈ మ్యాచ్ ను అసీస్ గెలిచిందనడం కంటే, కోహ్లీసేన ధారాదత్తం చేసిందనడం సమంజసంగా వుంటుందేమో. అసీస్ పోరాటాన్ని తక్కువ చేయకపోయినా ఈ విజయంలో వారి ప్రతిభ కంటే భారతజట్టు వైఫల్యాలే ఎక్కువ ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధాటిగా బ్యాటింగ్ చేసిన ధవన్-రోహిత్ జంట మొదటి వికెట్ కు 30.6 ఓవర్లలో రికార్డు స్థాయిలో 193 పరుగులు సాధించినా భారతజట్టు పట్టు నిలుపుకోలేక పోయింది. బ్యాటింగ్ కు స్వర్గధామంలా వున్న పిచ్ పై కోహ్లీ గత రెండేళ్లలోనే ఏడు పరుగుల అత్యల్ప స్కోరుకే వెనుతిరిగడం ఇదే మొదటి సారి. కె.ఎల్.రాహుల్, కేదార్ జాదవ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. 43 ఓవర్లలో 296 పరుగులు చేసిన టీమిండియా చివరి ఏడు ఓవర్లలో 6 వికెట్లు చేతిలో వున్నా 62 పరుగులు మాత్రమే జోడించగలిగింది. దీంతో ప్రత్యర్థికి 20 పరుగుల మేర విజయలక్ష్యం తగ్గింది. ఓ దశలో 370-375 పరుగులు చేస్తుందని భావించిన భారతజట్టు శిఖర్ ధవన్ వికెట్ పడడంతో తడబడి,ఆస్ట్రేలియాకు కేవలం 359 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది.

ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ కుమార్,ఛాహల్,కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, బుమ్రా మూడు వికెట్లు తీసినా స్లాగ్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆస్ట్రేలియా గెలుపు సాధ్యమైంది. చివరి ఆరు ఓవర్లలో అసీస్ విజయానికి 62 పరుగులు అవసరమైన దశలో భువీ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో 20 పరుగులు, 47వ ఓవర్లో 18 పరుగులు ఇచ్చాడు.బుమ్రా వేసిన 46వ ఓవర్లో అసీస్ బ్యాట్స్ మెన్ మరో 16 పరుగులు పిండుకున్నారు. భారత జట్టు చివరి ఏడు ఓవర్లలో కేవలం 62 పరుగులు చేస్తే…ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆరో వికెట్ కు 6.3 ఓవర్లలో ఏకంగా 86 పరుగులు చేసి, మరో 14 బంతులు మిగిలి వుండగానే నాలుగు వికెట్ల విజయం సొంతం చేసుకున్నారు.ఇతర బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్న నేపథ్యంలో …రెండో మ్యాచ్ హీరో, ఈ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్(5 ఓవర్లలో 29 పరుగులు) చేసిన విజయ్ శంకర్ ను కోహ్లీ మళ్లీ బౌలింగ్ కు దింపకపోవడం విశేషం.

భారత్ వైఫల్యంతో అసీస్ కు పండగ

భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధవన్-రోహిత్ జంట మొదటి వికెట్ కు 30.6 ఓవర్లలో 193 పరుగుల భారీ భాగస్వామ్యం ఇస్తే..అసీస్ మూడో వికెట్ కు 29.4 ఓవర్లలోనే 192 పరుగులు సాధించి ధీటుగా నిలిచింది. భారతజట్టులో ధవన్ 143,రోహిత్ 95 పరుగులు సాధిస్తే…. ఆస్ట్రేలియాను ఖవాజా 91,హ్యాండ్స్ కాంబ్ (117),టర్నర్ (84 నాటౌట్) విజేతగా నిలిపారు. భారత జట్టు పరాజయానికి రిషబ్ పంత్ దారుణమైన కీపింగ్ తో ప్రధాన కారకుడైతే…ఆస్ట్రేలియా విజయానికి టర్నర్ మూలస్తంభంలా నిలిచాడు. హైదరాబాద్ వన్డేతో ఆరంగేట్రం చేసిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టర్నర్ కు ఇది కేవలం రెండో వన్డే కావడం విశేషం. అయితే సెంచరీతో ఆదుకున్న హ్యాండ్స్ కోంబ్ అవుటయ్యాక క్రీజ్ లోకి వచ్చిన టర్నర్ కు రిషబ్ పంత్ లైఫ్ ఇచ్చి, భారతజట్టు పరాజయానికి కారకుడయ్యాడు.

ఆస్ట్రేలియా విజయానికి 7 ఓవర్లలో 72 పరుగులు కావలసిన కీలక దశలో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టర్నర్ ను స్టంపింగ్ చేయలేక పంత్ జీవనదానం చేశాడు. అదే ఓవర్లో కేదార్ జాదవ్, శిఖర్ ధవన్ రెండు బంతుల వ్యవధిలో రెండు క్యాచ్ లు వదిలేయడంతో బతికిపోయిన టర్నర్ ఆ తర్వాత కేవలం 16 బంతుల్లో 46 పరుగులు కొల్లగొట్టి, ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం అందజేశాడు. మూడో మ్యాచ్ లోనూ ధవన్ క్యాచ్ జారవిడవడంతోనే ఆస్ట్రేలియా కు విజయం సాధ్యమైన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి.వెరసి భారత బౌలర్లు, ఫీల్డర్లు, వికెట్ కీపర్ సమష్టి వైఫల్యాలకు…కెప్టెన్ వ్యూహరచనా లోపం జత కావడం భారత జట్టు ఓటమికి దారి తీసింది.ఈ సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే ఈనెల 13న ఢిల్లీలో జరుగుతుంది.

Recommended For You