అలా ఎలా మర్చిపోయింది.. ఆమె కోసం ప్లైట్ రివర్స్..

ఎవరైనా ప్రయాణాల్లో బ్యాగునో మరేదైనా లగేజీనో మరిచిపోతారు. మరీ విచిత్రంగా బిడ్డను మరిచిపోతారా.. అలా ఎలా జరిగిందో పాపని వెయిటింగ్‌ హాల్‌లో మరిచిపోయి ఓ తల్లి తనొక్కతే ప్లైట్ ఎక్కేసింది. సౌదీ అరేబియాలోని అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్లేందుకు ఎస్వీ 838 నెంబర్ గల విమానం సిద్ధంగా ఉంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పక్కన చూసుకుంటే పాప లేదన్న విషయం అర్థమైంది. కంగారు పడుతూ వెంటనే విమాన సిబ్బందికి సమాచారాన్ని చేరవేసి ఫ్లైట్‌ని వెనక్కి తీసుకెళ్లమని కోరింది. అసలైతే ఒకసారి టేకాఫ్ అయిన తరువాత ఎమర్జెన్సీ పరిస్థితులు మినహా.. ప్రయాణీకులు ఏ వస్తువు మరిచిపోయినా విమానాన్ని వెనక్కి మళ్లించరు.

కానీ ఇక్కడ పరిస్థితి వేరు తల్లి బిడ్డ గురించి పడుతున్న వేదన.. విమాన సిబ్బందిని కదిలించింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ రూంకి మెసేజ్ పాస్ చేశారు. అక్కడి అధికారులు అది విని షాకయ్యారు. ‌ప్లైట్ వెనక్కి రప్పించేందుకు సరేననడంతో విమానాన్ని తిరిగి జెడ్డాకు మళ్లించారు. ఈ లోపు అక్కడి విమాన సిబ్బంతి చేతిలో సురక్షితంగా ఉంది పాప.

బిడ్డకోసం తల్లడిల్లిన తల్లి మనసు పాపను చూడగానే కన్నీటి పర్యంతం అయింది. విమాన సిబ్బంది కృతజ్ఞతలు చెబుతూ ఈ సారి బిడ్డ చేతిని జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా ప్లైట్ ఎక్కింది.