అమ్మయినా స్లిమ్‌గా ఉండాలంటే ఎలా.. : సమీరా రెడ్డి

మూడు పదుల వయసు దాటినా పదహారణాల పడుచు పిల్లలా నైస్‌గా నాజూగ్గా ఉండాలంటే ఎలా.. అందునా అమ్మైతే బాడీలో కొంచెం మార్పులు కనిపిస్తాయి. దానికి ఏంటి అలా తయారయ్యావు. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేవు అని కామెంట్లు చేయడం ఎంత వరకు భావ్యం. రోజు రోజుకి వయసు పెరుగుతుందే కానీ తగ్గదు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్‌పై విరుచుకుపడుతోంది సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన సమీరా రెడ్డి.

తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో వ్యాపార వేత్తకు అక్షయ్‌ని వివాహమాడి సినిమాలకు దూరమైంది. ఆ తరువాత వీరికి ఓ కుమారుడు.. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్. దాంతో కాస్త ఒళ్లు చేసింది. ఈ నేపథ్యంలో తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అవి చూసిన నెటిజన్స్ ఊరుకుంటారా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేశారు. ఇంతకు ముందులా లేరు.. బాగా లావైపోయి అందవిహీనంగా కనిపిస్తున్నారు అని కామెంట్లు పెట్టారు. దాంతో సమీర సీరియస్ అయింది. అందరికీ కరీనా కపూర్లా జీరో సైజ్ మెయింటైన్ చెయ్యడం సాధ్యం కాదు. మాలాంటి వాళ్లం సన్నబడడానికి కాస్త టైం తీసుకుంటాం. అయినా ఆడవాళ్ల శరీరాకృతి గురించి కామెంట్ చేయడం మంచి పద్దతి కాదు. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తల్లికాక తప్పదు.

అయినా మీరు పుట్టాక మీ అమ్మ కూడా ఇంతకు ముందులానే ఉందా.. ఓ సారి అడిగి చూడండి. అమ్మ అనే పిలుపు అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది.. తనని గురించి తాను పట్టించుకునేంత టైం లేకుండా చేస్తుంది. శరీరం ఎలా ఉన్నా దాన్ని స్వీకరించడం ఎంతో అవసరం అంటూ నెటిజన్‌కి సమీరా ఫుల్లు క్లాస్ పీకారు.

Recommended For You